కరోనా వైరస్ బారిన పడకుండా తమని తాము కాపాడుకోవాలని అందుకోసం ఇళ్లనుండి బయటకి రాకుండా ఉండాలని, పరిశుభ్రంగా ఉండాలనీ కరోనా మీద అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు చిరంజీవితో కలిసి నాగార్జున, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కలిసి కరోనా వైరస్ మీద పాటతో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి రామ్ గోపాల్ వర్మ కూడా చేరారు.
కనిపించని పురుగు అంటూ రామ్ గోపాల్ వర్మ కరోనా గురించి తానే పాట రాసి మరీ పాడాడు. వర్మ వాయిస్ వినడానికి కొంచెం వింతగా అనిపించినా ఆయన ఇంటెన్షన్ బాగుంది. మొదటగా కరోనా వైరస్ ని చంపేయాలంటే కనిపించట్లేదని, పచ్చడి చేద్దామంటే కాసింత కండ కూడా లేని పురుగని చెప్పిన వర్మ.. మధ్యలోకి వచ్చేసరికి సీరియస్ టాపిక్ లోకి వెళ్ళిపోయాడు.
ఈ వైరస్ ని చైనావాళ్లే కావాలని ప్రపంచంపై ప్రయోగించారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అలాంటి అనవసర విషయాలని మాట్లాడుకోవడం వేస్ట్ అని, ఇప్పుడు ఉన్న ప్రాబ్లెమ్ ని క్లియర్ చేసుకున్న తర్వాత వాటి గురించి ఆలోచించాలని.. ప్రభుత్వం పెట్టిన లాక్ డౌన్ పనికిమాలిన చర్య కాదని, బయటకి వస్తుంటే పోలీసులు బాదేది బలిసి కాదని, మన మంచికోసమే అని కాబట్టి అందరూ వాటిని పాటించాలని చెప్పాడు.
ఇంకా కరోనా నుండి కాపాడుకోవడానికి అందరు చెప్పినట్టే చేతులు కడుక్కోవాలనీ, ఇళ్లలోనే ఉండాలనీ, గుమ్మం దాటి బయటకి రావొద్దని కోరాడు. మొత్తానికి సమాజం గురించి తనకి అవసరం లేదని చెప్పిన వర్మ కరోనా గురించి అవగాహన కల్పించడం చూస్తుంటే వర్మా మారాడేమో అనిపిస్తుంది.