అల్లు అర్జున్ హీరోగా పరిచయమై మార్చి 28కి 17 సంవత్సరాలు. అంటే అతని మొదటి చిత్రం ‘గంగోత్రి’ విడుదలైంది ఆ రోజునే. ఇన్నేళ్లుగా తన ఇమేజ్‌ను, మార్కెట్ వాల్యూను క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చాడు బన్నీ. కేరళలో క్రేజ్ ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ బన్నీనే. ఈ ఏడాది ‘అల.. వైకుంఠపురములో’ మూవీతో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సాధించిన అతను స్టార్‌డమ్‌ను ఎలా డీల్ చేస్తున్నారనే ప్రశ్నకు, ‘‘నిజాయితీగా చెప్పాలంటే, ఇది జీవితంలో ఒక భాగం’’ అని చెప్పాడు. పదిహేడేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడానికే ఇన్నేళ్లుగా పనిచేస్తూ వచ్చానని అనుకుంటున్నట్లు తెలిపాడు.
‘‘నాకు లభించిన ఆ గ్రాటిట్యూడ్‌ను ప్రతి క్షణం అనుభవిస్తున్నాను. ఇది నేను కచ్చితంగా కోరుకున్న విషయం. మనం దేన్నయినా పొందుతున్నప్పుడు, అందులో బెస్ట్ అనుకున్నదాన్నే తీసుకోవాలి. మనం కోరుకునేది అదేనని నేననుకుంటున్నా. నేను కోరుకున్నదీ, పొందుతున్నదీ అదే’’ అని బన్నీ చెప్పాడు.
మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వంటి మహా ఇమేజ్ ఉన్న నటులు ఉన్న కాంపౌండ్‌లో, లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా తెరంగేట్రం చేసిన బన్నీ.. ఆర్య, దేశముదురు, జులాయి, రేసుగుర్రం, సరైనోడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటించాడు. ఇంతకుముందే చెప్పుకున్నట్లు లేటెస్టుగా ‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు.
నటుడిగా చక్కటి పేరు తెచ్చుకుంటూనే, తన డాన్సులతోనూ అభిమానుల్ని అలరిస్తూ వస్తున్నాడు బన్నీ. నిజానికి ఈరోజు టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ ఎవరంటే క్షణం కూడా ఆలోచించకుండా ఎవరైనా చెప్పే పేరు అల్లు అర్జున్ అనే. అయితే డాన్స్ నేపథ్యంలో సినిమా చెయ్యాలనే ఆలోచన అతడి మనసులో లేదు.
‘‘నేనెక్కువగా ఇష్టపడేది సినిమానే. ఆ సినిమాలో డాన్స్ అనేది ఒక చిన్న భాగం అంతే. సినిమా అంటే ఎమోషన్స్ మీద నడిచేది. అందులో డాన్స్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇచ్చే ఒక చిన్న ఎలిమెంట్. సినిమాకి డాన్స్ ప్రధానాంశం కావాలని నేను అనుకోను’’ అంటాడు బన్నీ.
ప్రస్తుతం అతను సుకుమార్ డైరెక్షన్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో సినిమా చేస్తున్నాడు. అందులో అతను లారీ డ్రైవర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు.