కరోనా క్రైసిస్ కారణంగా సినిమా షూటింగులన్ని ఆగిపోవడంతో రోజువారి సినీ వర్కర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. కెమెరాలో రీల్ తిరిగితే తప్ప జీవితం గడవని వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చిన్న బడ్జెట్ సినిమా నుండి పెద్ద స్టార్ హీరో సినిమా వరకు వీరు కావాల్సిందే. అలాంటి వారిని కాపాడుకోవడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తున్నారు.
ఈ ఛారిటీకి టాలీవుడ్ సెలెబ్రిటీలు విరాళాలు అందిస్తున్నారు. ప్రభాస్ యాభై లక్షల రూపాయలు ఇవ్వగా, మహేష్ బాబు ఇరవై ఐదు లక్షల విరాళం ప్రకటించాడు. హీరో నిఖిల్,శర్వానంద్ ఇలా ప్రతీ ఒక్కరూ తమకి తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చారిటీకి స్పందించిన వారిలో ఎక్కువ మంది హీరోలే ఉన్నారు. హీరోయిన్లలో ఒక్క లావణ్య త్రిపాఠి తప్ప మిగతా ఎవరూ స్పందించకపోవడం విచిత్రం..
అయితే కోట్లకి కోట్లు రెమ్యునరేషన్లు తీసుకునే హీరోయిన్లు స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విరాళం ప్రకటించాలా లేదా అన్నది వారి నిర్ణయమే అయినప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమా మీదే సంపాదించుకునే వారు ఆ సినిమా కోసం కొంచెం విరాళం ఇవ్వడంలో తప్పేముందని అంటున్నారు.