కరోనా వైరస్ ప్రభావం వల్ల అందరూ ఎవరి ఇళ్లలోనే ఉండి సామాజిక దూరం పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రభావం తగ్గే వరకు ఎవరూ ఎవరిని కలవకూడదనే నిర్ణయం కారణంగా అందరూ సోషల్ మీడియాలో దగ్గరవుతున్నారు. ఇళ్లలోనే ఉండి ఫోన్లో తమ సందేశాలని తమ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నారు.
అంతకుముందు వీటన్నింటికీ దూరంగా ఉండేవారు సైతం ఈ పరిస్థితుల్లో వేగంగా ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉగాది రోజున ట్విట్టర్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. రామ్ చరణ్ చిన్ననాటి ఫోటోలని షేర్ చేసి అభిమానులకి ఆనందాన్ని పంచాడు. అలాగే కొన్నాళ్ళ కిందట ట్విట్టర్ నుండి బయటకి వెళ్ళిపోయిన రామ్ చరణ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయాడు. ఈ తరం హీరోల్లో దాదాపు అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. కానీ శర్వానంద్ మాత్రం ఈ విషయంలో లేట్ చేశాడు. నేడు కరోనా క్రైసిస్ కారణంగా రోజు వారి సినీ వర్కర్లకి 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించి, ఈ విషయాన్ని ఇటీవల స్టార్ట్ చేసిన ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. మొత్తానికి సామాజిక దూరం చాలా మంది సెలెబ్రిటీలని సామాజిక మాధ్యమాల ద్వారా దగ్గర చేసింది.