ఇంటర్నెట్ వాడకం రోజురోజుకీ పెరుగిపోతున్న ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ ఇంటర్నెట్ వాడుతున్నారు. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అయితే ఇంటర్నెట్ ఎంత మేలు చేస్తుందో అంత కీడు కూడా చేస్తుంది. దీనివల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చెడు మరింత పెరిగింది. సెలెబ్రిటీల విషయాల గురించి అనవసరమైన సమాచారమే కాకుండా వారి ఫోటోలని ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్ చేసేసి సైట్లలో వాడుకుంటూ ఉంటారు.
సినిమా హీరోయిన్ల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుంటుంది. తాజాగా బాహుబలి నటి ఆశ్రిత వేముగంటి ఫోటో ఒకటి డేటింగ్ యాప్ లో కనిపించింది. బాహుబలి 2 లో ఆశ్రిత అనుష్క వదినగా నటించి కన్నా నిదురించరా అన్న పాటలో డాన్స్ చేసిన నటి గుర్తుండే ఉంటుంది. యాత్ర సినిమాలోనూ వైయస్ విజయమ్మగా కనిపించింది. అయితే సడెన్ గా డేటింగ్ యాప్ లో ఆమె ఫోటో ప్రత్యక్షమయ్యేసరికి షాక్ అయ్యింది. వెంటనే ఈ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఆశ్రితవే కాదు ఇలా చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టుల ఫోటోలు డేటింగ్ యాప్స్ లో దర్శనమిస్తాయి.