‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫలానా పాత్రల్లో నటిస్తున్నారని మాత్రమే చెప్పిన జక్కన్న.. ఇంతవరకూ చిన్నపాటి లుక్ గానీ రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా.. అసలు ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి..? అని టైటిల్.. మోషన్ పోస్టర్‌ను ఉగాది పండుగ రోజున జక్కన్న రివీల్ చేశాడు. ఇందులో ఆర్ఆర్ఆర్ అంటే ‘రౌద్రం రుధిరం రణం’ అని ఇంతవరకూ నెలకొన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈ టైటిల్, మోషన్ పోస్టర్ వీడియోపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ తర్వాత చెర్రీ పుట్టిన రోజు వేడుకగా జక్కన్న చెక్కిన ఓ చిన్నపాటి వీడియో రిలీజ్ అయ్యింది. ఈ రెండు కూడా కరోనా నేపథ్యంలో బాగా హాట్ టాపిక్ అయ్యాయి.
జూనియర్ రెకమెండేషన్!
ఇదిలా ఉంటే.. సినిమా విషయంలో మళ్లీ అభిమానులు, ఔత్సాహికులు సినీ ప్రియుల్లో కన్ఫూజన్ మొదలైంది. అదేమిటంటే.. ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ హీరోలు నటిస్తుండగా మరో సూపర్ స్టార్ కూడా నటించనున్నాడన్నదే ఆ కన్ఫూజన్. ఆయన మరెవరో కాదండోయ్.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అట. రాజమౌళి ఇటీవలే సంప్రదించి పాత్ర గురించి చెప్పాడని.. వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి తెలుగులోనే ఎవర్నైనా తీసుకుందామని భావించినప్పటికి ఆ పాత్రగా సెట్ అయ్యేవారు ఎవరూ లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్.. మోహన్ లాల్ అయితే సరిగ్గా సెట్ అవుతాడని చెప్పాడట. దీంతో ఆయన్ను సంప్రదించడం.. పాత్ర వినడం అన్నీ అయిపోయాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది మరో పుకారు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా జక్కన్న చెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో అతిథి పాత్ర చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. వాస్తవానికి రాజమౌళి సినిమాలో నటించాలంటే చిన్నపాటి పాత్ర అయినా ఎవరూ వదులుకోరు. అలాంటిది విజయ్‌కు అవకాశం వస్తే ఎందుకు వదులుకుంటాడు. వాస్తవానికి సినిమాను ఫాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తుండటంతో కోలీవుడ్, మల్లువుడ్ ఇలా ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కర్ని తీసుకునే యోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా చిత్రసీమలో ఉండే వారిని చిన్నపాటి పాత్రలో అయినా నటింపజేసి దాంతో అక్కడ.. ఇక్కడా హడావుడి బాగానే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫైనల్‌గా ఎవరో..?
ఇన్ని రోజులుగా నెలకొన్న కన్ఫూజన్‌లకు చెక్ పెడుతూ టైటిల్, మోషన్ పోస్టర్, చెర్రీ పుట్టిన రోజు స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్రబృందం వాటన్నింటికీ చెక్ పెట్టేసింది. అయితే తాజాగా ఈ ఇద్దరు స్టార్ హీరోల విషయంలో మాత్రం మళ్లీ కన్ఫూజన్ నెలకొంది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు. వాస్తవానికి ఇలాంటి పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి జక్కన్న అస్సలు సాహసించడన్న విషయం తెలిసిందే. మరి ఫైనల్‌గా ఎవరెవరున్నారో..? ఇంకా ఎన్నెన్ని పుకార్లు పుడతాయో..? వాటిలో ఎన్ని నిజాలో.. ఎన్ని అబద్ధాలో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ..!