కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. మరోవైపు దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంటే.. ఏప్రిల్-14 వరకు లాక్‌డౌన్ ఉండనుంది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు నటులు అతిగా స్పందించి అడ్డంగా కూడా బుక్కవుతున్నారు.
అసలేం జరిగింది..!?
ఇలా బుక్కయిన వారిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఒకింత జోస్యం చెప్పాడు.. అది కాస్త అడ్డం తిరగడంతో పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ‘అందరూ కలిసి చప్పట్లు కొట్టడం వలన కరోనా వైరస్ చనిపోయే అవకాశం ఉంది. చప్పట్ల శబ్దం నుంచి ఓ మంత్రం లాంటిది పుట్టుకొస్తుంది. దీని వలన బ్యాక్టీరియా, వైరస్‌లు చనిపోయే అవకాశం ఉంటుంది. చప్పట్లు కొట్టి అందరం వైరస్‌ను నియంత్రిద్దాం’ అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ తంతు జనతా కర్ఫ్యూకు ముందు జరిగింది. అయితే.. ఈ మాటలు విన్న నెటిజన్లు, అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు ఉంటాయా..?
ఒక బాధ్యత గల యాక్టర్‌గా మీరు ఇలాంటివేనా చెప్పేది అంటూ ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్‌లో మోహన్‌లాల్‌పై ఫిర్యాదు చేశాడు. విపత్కర పరిస్థితుల్లో స్టార్ హీరో ఇలా చేయడం సరికాదని.. వెంటనే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. స్టార్‌డమ్ అనేది బాధ్యతగా కాకుండా ఎందుకిలా చేస్తున్నారని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కేసు ఎంతవరకూ వెళ్తుందో..? ఏంటో..
వాస్తవానికి.. కరోనా నేపథ్యంలో ఎవరైనా దుష్ప్రచారం చేసినా.. లేని పోని కల్పితాలు చెప్పినా వారిపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగానే జనతా కర్ఫ్యూకు ముందు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్స్‌ను ట్విట్టర్ యాజమాన్యం తొలగించడం జరిగింది. మరి మోహన్ లాల్ పరిస్థితేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.