కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అక్కడెక్కడో చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజ గజ వణికిస్తోంది. ఈ వైరస్ బారీన పడిన జనాలు వేలాది మంది మృత్యువాత పడగా.. మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వాళ్ల పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేం. వాళ్లు పడే బాధలు.. కష్టాలు పైనున్న పెరుమాళ్లకే ఎరుక. రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అయితే.. ఇలాంటి తరుణంలో కరోనాపై యుద్ధం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా ఆర్థిక విరాళాలు ప్రకటించి టాలీవుడ్‌కు చెందిన నటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు ఇలా చాలా మందే పెద్ద మనసు చాటుకున్నారు. అంతేకాదు.. తమకు తోచిన సలహాలు, సూచనలు కూడా చేశారు.
విమర్శలు..
అయితే.. ఇంత వరకూ నటులు మాత్రమే సాయం ప్రకటించారు కానీ.. నటీమణులు అస్సలు ముందుకు రాలేదు. అంతేకాదు.. అప్పుడెప్పుడో చిన్న పాటి సలహాలు, సూచనలు చేసిన వారు ఇప్పుడు మాత్రం ముందుకు రావట్లేదు. వాస్తవానికి రావడానికి కాస్త లేటవ్వచ్చేమో కానీ కచ్చితంగా వచ్చి పెద్ద మనసు విరాళాలు ప్రకటిస్తారనేది మాత్రం నిజమే. అయితే ఇప్పుడు సమయం ఆసన్నమైంది గనుక.. తమ వంతుగా చేయడానికి ముందుకు కదిలి రావాలి. నటీమణులు ముందుకు రాకపోయే సరికి సర్వత్రా విమర్శలు సైతం వస్తున్నాయ్.
కమాన్ మీ వంతు వచ్చేసింది..!
హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు మన ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని వాళ్లంతా ఇప్పుడేం చేస్తున్నారు..? వాళ్ల దగ్గర డబ్బుల్లేవా..? సాయం చేయడానికి మనసు రావట్లేదా..? కమాన్ మీరేమో సినిమాల కోసం కోట్లాను కోట్లు పుచ్చుకుంటారు?.. మీరు నటించిన ఆ సినిమాను మేమంతా హిట్ చేస్తాం.. అలాంటి మీకోసం అంత చేస్తున్నప్పుడు మీ సినిమాలు హిట్ చేసే జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాదండోయ్ ఇంకొందరైతే.. ఇంకో అడుగు ముందుకేసి మీకు బాధ్యత లేదా..? జనం సొమ్మునే కదా పారితోషికంగా తీసుకుంటున్నారు..? మరి వారికి కష్టాలొచ్చినప్పుడు సాయం చేయాలిగా.. మీరు కచ్చితంగా మంచి మనసు చాటుకుంటారని యావత్ సినీ ప్రపంచానికి తెలుసు.. కమాన్ బ్యూటీస్.. ఇక ఆలస్యమొద్దు.. మీ వంతుగా ఇచ్చేయండి..!