రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లోని రామరాజు పరిచయం చేశాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని చూసినవాళ్ళంతా ఆహా అంటున్నారు. మన ఊహకి అందని విధంగా రామ్ చరణ్ లుక్ ని ప్రెజెంట్ చేశాడు రాజమౌళి. ఎన్టీఆర్ వాయిస్ తో రామరాజుని పరిచయం చేయించాడు. ఐదు భాషల్లో రిలీజ్ చేసిన ఈ వీడియోకి నాలుగు భాషల్లో ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పాడు.
తెలుగులో ఎన్టీఆర్ ఇరగదీస్తాడని అందరికీ తెలుసు. ఆ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా ఎన్టీఆర్ గొంతు వినిపించింది. రామరాజుని పరిచయం చేయడంలో విజువల్స్ ఎంత బాగున్నాయో, ఆ విజువల్స్ కి ఎన్టీఆర్ గొంతు మరింత ప్లస్ అయ్యింది. ముఖ్యంగా మా అన్న.. మన్నెందొర అన్నప్పుడు ఒక్కొక్కరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఏ నటుడైనా తనకి తెలిసిన భాషలో డబ్బింగ్ చేయడం ఏమంత కష్టం కాదు.
కానీ తనకి ఏమాత్రం ఎక్కువగా పరిచయం లేని భాషల్లోనూ తెలుగులో చెప్పినంత అలవోకగా చెప్పడం ఎన్టీఆర్ కే చెల్లింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు ఎన్టీఆర్, ఈ నాలుగు భాషల్లో ఒకే ఎమోషన్ కనిపించింది. అన్ని భాషల్లోనూ అలవోకగా వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటుందో మరోసారి అర్థమైపోయింది.