ప్రజలకు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఎప్పుడెలాంటి కష్టమొచ్చిన టాలీవుడ్ ముందు ఉంటుంది. ఈ విషయాన్ని ఇదివరకే పలుమార్లు నిరూపించుకుంది కూడా. ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి విషయంలోనూ ప్రజలకు, ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు టాలీవుడ్ నటీనటులు కదిలి ముందుకొచ్చి తమ వంతుగా ఆర్థిక విరాళాలు ప్రకటించడం అభినందించదగ్గ విషయమే. విరాళాలు ఇచ్చేసి ఊరుకోవట్లేదు.. తగు జాగ్రత్తలు, సలహాలు, సూచనలు చేస్తున్నారు. అయితే.. ఇలా తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలకు ఆర్థిక విరాళాలు ప్రకటించి పెద్ద మనసు చాటుకున్న టాలీవుడ్ నటీనటులకు సోషల్ మీడియా ద్వారా పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జేజేలు పలికారు.
పేరుపేరునా..!
టాలీవుడ్‌లో మొట్ట మొదట యంగ్ హీరో నితిన్ నుంచి ఈ విరాళాలు ఇవ్వడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక్కొక్కరు నటీనటులు తమవంతుగా విరాళాలు ప్రకటించడం మొదలుపెట్టారు. మరోవైపు దర్శకనిర్మాతలు కూడా ఆర్థిక సాయం చేయడం షురూ చేశారు. అలా అలా.. ఇప్పటికే చాలా మంది చిత్ర పరిశ్రమకు చెందిన వారు సాయం ప్రకటించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. వీరందరికీ పేరుపేరునా పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా.. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరును ప్రస్తావించి కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దన్నయ్య.. యువశక్తి..!
సినిమా పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా తక్షణమే స్పందించే పెద్ద అన్నయ్య (మెగాస్టార్ చిరంజీవి) పెద్దమనసుతో కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద కళాకారులు, టెక్నిషియన్స్‌కు కోటి రూపాయలు విరాళం ఇచ్చినందుకు తమ్ముడిగా తాను గర్వపడుతున్నానని పేర్కొన్నారు. అలాగే తండ్రి అడుగు జాడల్లో నడిచిన రూ.70 లక్షలు విరాళం ప్రకటించిన రామ్‌చరణ్‌కు, రూ.75 లక్షలు విరాళం ఇచ్చిన యువశక్తి (యంగ్ టైగర్ ఎన్టీఆర్), కోటి పాతిక లక్షల రూపాయల విరాళాన్ని అందించిన బన్నీకి, తొలి విరాళంగా రూ.20 లక్షలు ప్రకటించిన నితిన్, రూ.10 లక్షలు విరాళం ప్రకటించిన సాయితేజ్‌కి, రూ.20 లక్షలు రూపాయల విరాళం అందించిన త్రివిక్రమ్, కొరటాల శివ, దిల్‌రాజులకు, పదిలక్షల రూపాయలు అందించిన అనిల్ రావిపూడి, రూ.5 లక్షలు అందించిన తమన్‌కు పవన్ ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పవన్ ధన్యవాదాలు తెలిపారు. పవన్ ట్వీట్‌కు పలువురు స్పందించి రిప్లయ్‌లు కూడా ఇచ్చారు.