కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. చైనాలో రోజురోజుకూ కొత్త వైరస్‌లు పుడుతుండటం.. మరోవైపు ఇటలీలో మరణాల సంఖ్య పెరిగిపోయి శవాల దిబ్బగా మారడంతో అక్కడున్న జనాలు.. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భయంతో వణికిపోతున్నారు. అసలు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇళ్లలో నుంచి రాకుండా ఉండలేక.. వస్తే ఎక్కడ వైరస్ సోకుతుందో అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతికేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రకటనల కంటే ముందుగానే సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు, థియేటర్లు మూసివేస్తున్నట్లు టాలీవుడ్ పెద్దలు ప్రకటించారు. మొదట మార్చి-31వరకే ఈ పరిస్థితి ఆ తర్వాత మంచి రోజులొస్తాయని భావించారు.
అయితే.. ఇటీవలే ప్రధాని మోదీ ఈ లాక్‌డౌన్‌ను మరో 21 రోజుల పాటు ప్రకటించడం.. మున్ముంథు ఇంకా అది పొడిగించే అవకాశాలు మెండుగా ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే సినిమా షూటింగ్‌లు లేక కార్మికులు, దినసరి కూలీలు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ పెద్దలు వారికి అండగా నిలుస్తున్నారు. అయితే.. అసలు ఈ నెలలో రిలీజ్ కావాల్సిన సినిమాలను వచ్చే నెలలో అయినా విడుదల చేసుకుందామని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులను బట్టిచూస్తే ఏప్రిల్ మొత్తం రిలీజ్ కాదు కదా.. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితులు కూడా కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే.. ఏప్రిల్‌లో టాలీవుడ్ నుంచి సినిమాలు రిలీజ్ కష్టమేనన్న మాట. ఏప్రిల్‌లో పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిందేనని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది.
అంతేకాదండోయ్.. ఈ పరిస్థితులు ఏప్రిల్ నెలే కాదు.. మే పైన కూడా ప్రభావం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయ్.!. అయితే దీనిపై ఇండస్ట్రీలో మాత్రం భిన్న వాదనలే వినిపిస్తున్నాయ్.. కచ్చితంగా ఏప్రిల్ చివరికల్లా సినిమా షూటింగ్ ప్రారంభించి తీరుతాం అని కొందరూ.. అవును తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ షురూ చేద్దామని మరికొందరు నిర్మాతలు మాట్లాడుకుంటున్నారట. ఇప్పటికే చాలా నష్టపోయాం.. ఇక ముందు కూడా అంటే అస్సలు జరగని పనని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. మరి ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. ఈ లాక్‌డౌన్ ఎప్పుడు పూర్తవుతుందో..? కరోనా వైరస్ ఏ మేరకు తగ్గుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.