కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పనులు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఈ లాక్ డౌన్ వల్ల రోజువారి కూలీల పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రభుత్వం వీరికి కొంతమేర అండగా నిలుస్తున్నప్పటికీ వీరి పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉంది. రోజూ వారి కూలీలు ప్రతీ రంగంలోనూ ఉన్నారు.
సినిమారంగంలో కూడా ఈ రోజు వారీ కూలీలు ఉన్నారు. షూటింగ్ జరిగినప్పుడే వీరికి డబ్బులొస్తాయి. షూటింగ్ లేని సమయాల్లో వీరు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. వీరి పరిస్థితిని అర్థం చేసుకున్న సినిమా హీరోలు వీరికి తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా రజనీ కాంత్ రోజు వారి సినీ కార్మికుల కోసం తనవంతు సాయంగా యాభై లక్షల రూపాయలు ప్రకటించాడు.
షూటింగ్ లు లేని ఈ సమయాల్లో వారి ఆందోళనని తగ్గించడానికి రజనీ కాంత్ చేసిన సాయం ఎంతో ఉపయోగపడుతుంది. రజనీయే కాదు తమిళ హీరోలైన సూర్య, కార్తీలు కూడా పది లక్షల రూపాయలు సినీ కార్మికుల కోసం విరాళంగా ఇచ్చారు. కరోనా సృష్టిస్తున్న కొరతని ఇలా సాయం చేయడం ద్వారా కొంచెమైనా తగ్గిస్తున్న హీరోలకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.