హీరోగా సంక్లిష్ట స్థితిలో ఉన్నప్పటికీ నందమూరి బాలకృష్ణ ప్రస్తుత సినిమాపై క్రేజ్ వస్తుందనుకున్న వాళ్లకు ఆశాభంగం ఎదురవుతోంది. కారణం ఆ సినిమాకి బోయపాటి శ్రీను డైరెక్టర్ కావడం. బోయపాటి శ్రీనుతో మునుపటి బాలకృష్ణ సినిమాలు - ‘సింహా’, ‘లెజెండ్’ - ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్టయ్యాయి. వాటి తర్వాత ఆయన బాలయ్యతో తీస్తున్న సినిమా కావడంతో దానిపై ట్రేడ్‌లో, సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొనడం సహజం. కానీ అందుకు విరుద్ధంగా బాలకృష్ణ, బోయపాటి మూడోసారి కలిసి సినిమా చేస్తున్నారనే ప్రకటన వచ్చిన దగ్గర్నుంచీ పెద్దగా స్పందన రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
బాలయ్య అభిమానుల వరకే ఆశలు పరిమితమయ్యాయని సోషల్ మీడియా ఫాలోయర్స్‌కు తెలిసిన విషయం. ఎందుకంటే క్రిష్ డైరెక్ట్ చేసిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం తర్వాత బాలకృష్ణ నుంచి మరో హిట్ రాకపోవడం. క్రేజీ కాంబినేషన్ అనుకుంటూ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో చేసిన ‘పైసా వసూల్’ సినిమా బాక్సాఫీసును గెలవలేకపోయింది. ఒకప్పుడు తమిళంలో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ తీసిన కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో చేసిన ‘జై సింహా’ యావరేజ్‌గానే ఆడింది. ఇక ఆ తర్వాత బాలయ్య చేసిన మూడు సినిమాలు అత్యంత దారుణంగా డిజాస్టర్స్ అయ్యాయి. వాటిలో రెండు సినిమాలు మహానటుడు, తెలుగువాళ్ల ఆరాధ్య నాయకుడు ఎన్టీ రామారావు బయోపిక్‌గా వచ్చిన ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలు కాగా, మూడోది కె.ఎస్. రవికుమార్‌తో మరోసారి చేసిన ‘రూలర్’ ఫిల్మ్.
ఈ నేపథ్యంలో బోయపాటితో మూడోసారి జట్టు కట్టి సినిమా చేస్తున్నాడు బాలయ్య. తన కెరీర్‌లో ‘దమ్ము’, ‘వినయ విధేయ రామ’ అనే రెండు ఫ్లాపులు మాత్రమే బోయపాటి చవిచూశాడు. అయినప్పటికీ వాటికి వచ్చిన ఓపెనింగ్స్ బ్లాక్‌బస్టర్ రేంజిలో ఉన్నాయి. ఆ తర్వాత నెగటివ్ టాక్‌తో అవి ఫ్లాపులుగా మిగిలాయి. భద్ర, తులసి, సింహా, లెజెండ్, సరైనోడు సినిమాలు బోయపాటి దర్శకత్వ సామర్థ్యానికి ఉదాహరణలుగా నిలిచాయి. ఆఖరుకి బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఆయన చేసిన ‘జయ జానకి నాయక’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అది కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది కానీ, ఆ సినిమాని ఒక మాస్ స్టార్ చేసినట్టయితే కచ్చితంగా పెద్ద హిట్టయ్యేదనేది విశ్లేషకుల అభిప్రాయం.
కెరీర్‌లో బాలయ్య క్లిష్ట స్థితిలో ఉన్న రెండు సందర్భాల్లో ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు చేసి గట్టెక్కించిన ట్రాక్ రికార్డ్ ఉన్న బోయపాటి ఇప్పుడు మరోసారి అదే స్థితిలో ఉన్న బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు. పీడకల లాంటి వరుస మూడు డిజాస్టర్స్ జ్ఞాపకాల్ని బోయపాటితో చేస్తున్న సినిమా తుడిచిపెడుతుందనే గట్టి ఆశతో బాలయ్య అభిమానులు ఉన్నారు. ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తరహాలోనే ఈ మూవీలోనూ బాలయ్య డ్యూయెల్ రోల్‌లో కనిపిస్తాడని టాక్. ఎప్పటిలా వీటిలో ఒక రోల్ హై ఇంటెన్సిటీతో ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో హ్యాట్రిక్ సాధిస్తుందా? లెటజ్ వెయిట్ అండ్ సీ.