ప్రస్తుతం భారత్ మొత్తం కరోనా కారణంగా జనతా కర్ఫ్యూతో ఎక్కడిక్కడ నిలిచిపోయి.. అంతా బంద్ వాతావరణం కనబడింది. ఇండియా మొత్తం 14 గంటలు జనతా కర్ఫ్యూ అంటే తెలంగాణాలో కేసీఆర్ మాత్రం 24 గంటల జనతా కర్ఫ్యూ చేయాలంటూ పిలునిచ్చారు. అత్యవరస ప్రయాణాలు తప్ప ఎవరూ రోడ్డు మీదకి రావద్దు అని చెప్పడంతో అందరూ జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అయితే సినిమా ప్రముఖులు అంతా ఇంట్లో కూర్చుని జనతా కర్ఫ్యూ పై అందరిలో చైతన్యం నింపడమే కాదు... ఈ కర్ఫ్యూ అనేది మన కోసమే.. అందరూ ఇంట్లోనే ఉండండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇక టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇంటోనే కూర్చుని తల్లితో కలిసి కొత్త ఆవకాయ కలిపారు. అశ్వద్ధామ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ప్రస్తుతం పలు సినిమాల్తో బిజీగా వున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ బంద్ అవడం నేడు ఆదివారం జనతా కర్ఫ్యూ కారణంగా ఇళ్లకే పరిమితమైన నాగ శౌర్య తల్లి ఉషతో కలిసి ఆవకాయ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నానంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మామిడికాయ పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ కావడంతో.. శౌర్య తన జనత కర్ఫ్యూని ఇలా వినియోగించుకున్నారు. తల్లి పచ్చడికి కావాల్సిన సరుకులు వేస్తుంటే నాగ శౌర్య ఆవకాయని చేతితో కలుపుతూ ఆ ముచ్చటైన దృశ్యాన్ని వీడియో రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కొత్తావకాయ.. హోమ్ మెడ్ అంటూ వీడియో షేర్ చేసాడు.