సిద్ శ్రీరామ్.. పాటలకు ఊపిరి ఊది ప్రజల గుండెలను గెలిచిన నవయుగ గాయకుడు. మత్తు నిండిన స్వరంతో గమ్మత్తైన గమకాలతో స్పష్టమైన ఉచ్ఛారణతో సిద్ సాంగ్ సింగితే.. మిలియన్స్ కొద్దీ వ్యూస్ రావాల్సిందే. ఇలా ప్రతీ పాటతో అటు సంగీత దర్శకులు.. ఇటు సంగీత ప్రియుల మనసులను దోచుకుంటున్నాడు. ఇప్పటి వరకూ ఆయన పాడిన తెలుగు, తమిళ పాటలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. ఇలా తెలుగు తమిళ్‌లోనే కాదు.. కన్నడలో కచేరిలో చేస్తూ అక్కడా ఉంటా.. ఇక్కడా ఉంటా.. అంటూ సౌతిండియా మోస్ట్ వాంటెడ్ సింగర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు.. ఇప్పుడు తెలుగులో చాలావరకు సినిమాల్లో ఈయన్నే మొదటి చాయిస్‌గా దర్శకనిర్మాతలు ఎంచుకుంటున్నారంటే ఈ సింగర్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. చిన్న చితకా హీరోలు మొదలుకుని స్టార్ హీరోలకు సాంగ్స్ చేసే వరుస అవకాశాలు వస్తుండటంతో ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడిని సిద్ పాటిస్తున్నాడట. మనకు కావాల్సినంత పేరు వచ్చింది.. ఇక కావాల్సింది పైసలేనని భావించిన సిద్.. ఒక్కసారిగా భారీగానే పారితోషికం పెంచేశాడట. ఇప్పటి వరకూ ఒకట్రెండు లక్షలతో పాట పాడే ఈ మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు ఏకంగా ఐదంటే ఐదు అంటూ చేతి వేళ్లు చూపిస్తున్నాడట. అయినప్పటికీ ప్రస్తుతం సిద్ తప్ప మరో ఆల్టెర్‌నేటివ్ లేకపోవడం ఐదు లక్షలేగా ఇచ్చేద్దాం అని దర్శకనిర్మాతలు ఏ మాత్రం వెనుకాడట్లేదట.
కాగా.. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సిద్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ‘ఉండిపోరాదే..’, ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే..’, ‘సామజ వర గమన’, ‘నీలి నీలి ఆకాశం ..’ వంటి పాటలు ఆయన స్థాయిని పెంచేశాయి. అలా మంచి హిట్ పాటలతో యూత్‌లో తెగ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సొంత భాషలో కంటే ఎక్కువగా ఇక్కడ పాటలు పాడటం.. అంతకుమించి ఫాలోయింగ్ తెచ్చుకోవడం విశేషమని చెప్పుకోవచ్చు.