దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు.. అందుకే దీన్ని ఎక్కువగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఒకట్రెండు హిట్‌లు వస్తే చాలు ఇక ఒక్కసారిగా రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. అంతేకాదు.. తర్వాత సినిమాకు, ఆ తర్వాత సినిమాకు మరింత పారితోషికం తెగ పెంచేస్తుంటారు. తాజాగా.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో పాపులరైన నిధి అగర్వాల్ కూడా ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఘన విజయం సాధించడంతో టాలీవుడ్‌లో ముందు వరుసలోకి వచ్చేసింది ఈ బ్యూటీ. ఈ సినిమాతో మంచి గుర్తింపే కాకుండా.. యూత్‌లో ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.
అలా టాలీవుడ్‌లో రాణిస్తున్న ఈ ముద్దుగమ్మకు ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయ్. ఒక్క తెలుగులోనే కాదండోయ్.. అటు తమిళ్‌లో కూడా గట్టిగానే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయ్. జయం రవితో కలిసి ‘భూమి’ అనే పేరుతో వస్తున్న సినిమాలో పక్కా పల్లెటూరి అమ్మాయిలా నిధి కనిపిస్తోంది. ఇదివరకే ఈ లుక్ కూడా వచ్చేసింది.. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సినిమాలో నటించడానికి గట్టిగానే తీసుకుంటున్న ఈ బ్యూటీకి తమిళంలో మరో బంపరాఫర్ వచ్చిందట. మేడమ్.. ఐటెం సాంగ్‌లో చేస్తారా ఓ కుర్రహీరోతో సినిమా తెరకెక్కిస్తున్న దర్శకనిర్మాతలు అడగ్గా.. ఆ భామ మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పిందట. కానీ ఓ మెలిక పెట్టిందట.
అక్షరాలా అరవై లక్షలు ఇచ్చుకుంటేనే తాను నటిస్తానని లేకుంటే తనను చీటికి మాటికీ డిస్టబ్ చేయొద్దని చెప్పేసిందట. దీంతో సదరు నిర్మాతలు ఇక ఇదేనా ఫైనల్ మేడం.. ఇంకా ఏమైనా తగ్గింపులు ఉంటాయా అని అడగ్గా.. అస్సలు తగ్గే ప్రసక్తే లేదని తెగేసి చెప్పేసిందట. దీంతో ఆ దర్శకనిర్మాతల దండం పెట్టి.. మిన్నకుండిపోయారట. అయితే ఇది ఎంతవరకు నిజమో..? తెలియాల్సి ఉంది. వాస్తవానికి రెమ్యునరేషన్ ఇంత తీసుకుంటున్నా అని ఏ యాక్టర్ కూడా బహిరంగంగా చెప్పుకోరు. మరి ఈ బ్యూటీ పెదవి విప్పుతుందేమో వేచి చూడాలి మరి.