మెగాస్టార్ చిరంజీవితో సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కిస్తున్నారు. చిరు 152 సినిమా కావడం.. ఇప్పటికే అన్ని చిత్రాల కొట్టిన కొరటాల దర్శకుడు కావడంతో మెగాభిమానులు, సినీ ప్రియుల్లో పెద్ద ఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే కొంత మేరకు చిత్రీకరణ పూర్తయ్యింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో సినిమా వాయిదా వేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో అందరికంటే ముందుగా మెగాస్టారే ప్రకటించారు. సినిమా యూనిట్ గ్యాప్ తీసుకున్నప్పటికీ దీనికి సంబంధించి పుకార్లు మాత్రం పెద్ద ఎత్తునే షికార్లు చేస్తున్నాయ్. హీరోయిన్ విషయం మొదలుకుని సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వార్తలు వినిపిస్తున్నాయ్.
ఇదివరకే రెమ్యునరేషన్ విషయంలో మహేశ్ అడిగినంత ఇచ్చుకోలేక దర్శకనిర్మాతలు ఆయన్ను పక్కనెట్టారని వార్తలు వినిపించాయ్. ఆ తర్వాత మళ్లీ చెర్రీనే రంగంలోకి దిగాడని వార్తలొచ్చాయ్. అయితే సేమ్ టూ సేమ్ చెర్రీ కూడా పారితోషికం విషయంలో అస్సలు తగ్గనని తెగేసి చెప్పాడట. మహేశ్‌కు రోజుకు కోటి చెప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడట. దీంతో ఆయన్ను వద్దనుకొని చెర్రీనే తీసుకుంటే.. ఈయన కూడా రోజుకు అదే కోటి రూపాయిలు తనకు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పేశాడట. అంటే సీన్‌లోకి చెర్రీ వచ్చినా డీల్ మాత్రం మారలేదన్న మాట. మొత్తం ముప్ఫై రోజులకుగాను అక్షరాలా ముప్ఫై కోట్లు ఇచ్చుకోవాల్సిందేనన్న మాట.
కాగా.. మ్యాట్నీ ఎంటెర్‌టైన్‌మెంట్స్ వారితో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చెర్రీనే ఈ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇదివరకే మ్యాట్నీ-కొణిదెల ప్రొడక్షన్స్ మధ్య వివాదం నెలకొందని వార్తలు రాగా ఓ పేద్ద ప్రకటనే విడుదల చేయడం జరిగింది. మరి చెర్రీ రెమ్యునరేషన్ విషయం ఎంతవరకూ నిజమో..? చెర్రీ రెమ్యునరేషన్ నిజంగానే అడిగాడా..? అయినా తాను నిర్మిస్తున్న సినిమాకే పారితోషికం అడగటమేంటి..? అనేదానిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.