కరోనా వైరస్ నియంత్రణకై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు ‘జనతా కర్ఫ్యూ’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కర్ఫ్యూకి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు స్పందిస్తూ తమ మద్దతు తెలిపారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, మంచు మనోజ్, జూనియర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను లాంటి వారు మద్దతిస్తూ అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు పలు సూచనలు చేశారు. అయితే.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ మాత్రం వెరైటీగా స్పందించి.. ఒకింత కామెడీ.. మరోవైపు సెటైరికల్‌గా ఓ వీడియో చేశాడు.
మనం కూడా అలానే చేద్దాం!
‘ఆదివారం అందరం ఇంట్లోనే ఉందాం. ప్రధాని మోదీ గారు ఎందుకు చెప్పారో.. ఆయన చెప్పిన మాట విందాం. ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉంటే ఆ కరోనా వైరస్ తాలుకూ చైన్ కట్ అవుతుందని పెద్దలందరి అభిప్రాయపడుతున్నారు. వాళ్ల మాటను గౌరవించి ఇంట్లోనే ఉందాం. ఈవాళ కరోనా లేని ప్లేస్‌లోకి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే వూహాన్‌కు వెళ్లండి. చైనాలో కరోనా వస్తే.. దేశం మొత్తం కట్టగట్టుకుని కరోనాని చావకొట్టారు. అలాగే మనం కూడా ఆ పని చేయాలనుకుంటే పెద్దలు చెప్పిన మాట వినండి’ అని పూరీ చెప్పుకొచ్చాడు.
ఉండలేకుంటే ఆముదం తాగండి..!
‘కొంత మంది నేను ఇంట్లో ఉండలేను అని నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లకి, ఫ్రస్టేట్ అయ్యేవాళ్లకు నేను ఒక సలహా చెబుతాను. ఆదివారం నిద్ర లేవగానే నాలుగు స్ఫూన్లు ఆముదం తాగండి. అలా చేస్తే మోషన్స్ అవుతాయ్. ఇక బయటికి పోయే పనికాదు కదా.. ఆ పనిలో బిజీగా ఉంటారు. అలా సాయంత్రం అయిపోతుంది. హ్యాపీగా కూడా ఉంటది. సో.. ఇలాంటి టైమ్‌లో నెగిటివ్‌గా లేకుండా చెప్పిన మాట వినండి. రేపందరూ ఇంట్లోనే ఉండండి. లవ్ యు ఆల్..’ అని పూరీ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పెద్ద ఎత్తున నెగిటివ్‌గానూ.. అదే విధంగా పాజిటివ్‌గానూ కామెంట్స్ వస్తున్నాయ్. కొందరైతే ఏం చెప్పావ్ డార్లింగ్ లవ్ యూ అంటూ పూరీకి రిప్లైలు ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంతమంది స్పందించినా చదువుతుంటే అంత కిక్ లేదు కానీ.. పూరీ మాత్రం ఈ విషయంతో తనలోని దర్శకత్వాన్ని బయటపెట్టాడబ్బా.. అని అభిమానులు చెప్పుకుంటున్నారు.