త్రివిక్రమ్ ఎన్టిఆర్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ తో పాటు సాంకేతిక నిపుణులు ఎవరనేది ఇంకా తెలియదు. సాంకేతిక నిపుణులు ఎలా ఉన్నా సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం అందరికీ ఆసక్తిగా ఉంది. త్రివిక్రమ్ సినిమాల్లో సంగీతానికి, సాహిత్యానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. మొన్నటికి మొన్న అల వైకుంఠపురములో పాటలకి ఎంత పేరొచ్చిందో అందరికీ తెలుసు.
అల వైకుంఠపురములో ఆల్బమ్ మొత్తం బ్లాక్ బస్టర్ అయింది. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే అల వైకుంఠపురములో నాన్ బాహుబలి ఇండస్ట్రీ సాధించిందంటే అందులో పాటల పాత్ర ఎక్కువగా ఉంది. థమన్ అందించిన సంగీతానికి జనాలు చెవులు కోసుకున్నారు. అయితే మరి అంతటి మ్యూజిక్ అందించిన థమన్ ని ఎన్టిఆర్ సినిమాకి కూడా తీసుకుంటున్నాడా లేదా అనేది సందేహంగా మారింది.
అరవింద సమేత దగ్గర నుండి అల వైకుంఠపురములో వరకు థమన్ ఇచ్చిన సంగీతంలో చాలా కొత్తదనం ఉంది. ప్రస్తుతం అతడు పనిచేస్తున్న ఇతర చిత్రాల మ్యూజిక్ కూడా సూపర్ హిట్ అవుతుంది. అందుకని ఏ మాత్రం సంకోచం లేకుండా థమన్ నే తీసుకుంటాడని, అందులో ఆప్షన్ కూడా తీసుకోడని ప్రచారం జరుగుతుంది. మరేం జరగనుందో చూడాలి.