రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్నాడు. తెలుగుతో పాటు మరో పదిభాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకి సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్రం అనంతరం రాజమౌళి ఎవరితో సినిమా చేయనున్నాడనే టాపిక్ మీద చర్చ నడుస్తుంది.
సాధారణంగా భారీ చిత్రం తీసిన తర్వాత ఒక మీడియం బడ్జెట్ మూవీ తీయడం రాజమౌళికి అలవాటు. మగధీర వంటి భారీ బడ్జెట్ తర్వాత మర్యాద రామన్న అలా వచ్చిందే. కానీ బాహుబలి తర్వాత మళ్ళీ మరో పెద్ద ప్రాజెక్టు ఆర్ ఆర్ ఆర్ ని తలకెత్తుకున్నాడు రాజమౌళి. అయితే ఆర్ ఆర్ ఆర్ తీసిన తర్వాత ఖచ్చితంగా చిన్న సినిమానే తీస్తాడని, అందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
రామ్ ఇటీవల ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ విజయంతో మాస్ జనాల్లో అతనికి ఫాలోయింగ్ పెరిగింది. రాజమౌళి తీసేది మాస్ చిత్రాలే కాబట్టి రామ్ తో రాజమౌళి సినిమా ఉంటుందని నమ్ముతున్నారు.