బాహుబలి సినిమా ద్వారా నేషనల్ స్టార్ అయిపోయిన ప్రభాస్ తో సినిమా చేయాలని ఎవరికి ఉండదు. ఛాన్స్ రావాలే గానీ తమ సత్తా ఏంటో ఇండియా మొత్తం చూపించడానికి ప్రతీ ఒక్క దర్శకుడూ రెడీగా ఉంటాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఛాన్స్ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సినిమా అనంతరం ప్రభాస్ చేయబోయే సినిమా టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో ఉంటుందని, దానికి మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తాడని, వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ మూవీ తెరకెక్కనుందని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో దర్శకుడు ప్రభాస్ తో సినిమా కోసం కథని సిద్ధం చేస్తున్నాడట. అర్జున్ రెడ్డి సినిమాతో తానేంటో నిరూపించుకుని, బాలీవుడ్ లో కబీర్ సింగ్ తీసి అతని స్టామినాని పెంచుకుని స్టార్ హీరోల మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో సినిమ చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.
ప్రభాస్ పాపులారిటీకి ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా లెవెల్లో ఉండేలా తన కథని సిద్ధం చేసుకుంటున్నాడని టాక్. కథ పూర్తికాగానే ప్రభాస్ కి వినిపించాలని చూస్తున్నాడట. కథ బాగుంటే సందీప్ తో చేయడానికి ప్రభాస్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.