కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ గడగడలాడిస్తుంది. దీని ధాటికి ప్రతీ ఒక్కరూ గజగజా వణికిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ కొద్ది కాలంలోనే ప్రపంచమంతటా పాకింది. ఇప్పటి వరకు ఐదువేలకి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయని వార్తలు వస్తున్నాయి. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇతర దేశాల్లో దీని విస్తరణ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇటలీ, దక్షిణకొరియా వంటి దేశాల్లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది.
అయితే ఒకవైపు కరోనా వల్ల సినిమాల షూటింగ్ లన్నీ బంద్ చేసేస్తుంటే మరికొందరు మాత్రం కరోనాని వాడుకుంటున్నారు. సమాజంలో ఏదైనా ఆసక్తికరమైన సంఘటన జరిగితే దాని గురించి చాలా సినిమాలు వస్తుంటాయి. అలాగే ఇప్పుడు కరోనా గురించి ఓ సినిమా రాబోతుందట. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ కరోనా ప్యార్ హై అంటూ సినిమా టైటిల్ ని రిజిస్టర్ చేయించిందట.
కహోనా ప్యార్ హై అనే సినిమా బాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. దానికి సిమిలర్ గా కరోనా ప్యార్ హై అంటూ ఈ సినిమా ఉండనుందట. మరి కరోనా గురించి ప్రపంచమంతా అంతలా వణికి పోతుంటే దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకోవడం ఎంతవరకు కరెక్టో వారికే తెలియాలి. ఈ కరోనా ప్యార్ హై టైటిల్ రిజిస్టర్ చేయించడాన్ని బాలీవుడ్ సెలెబ్రిటీలు తప్పు పడుతున్నారు.