కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్పందించి తమ వంతుగా జాగ్రత్తలు, సలహాలు, సూచనలు, చిట్కాలు షేర్ చేసుకున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రియాక్ట్ అవుతూ.. ఇదిగో ఇలా చేస్తే మీ దరికి కూడా కరోనా రాదని.. మందు చెప్పాడు! ఇంతకీ ఆ మందేంటో చూద్దాం.
ఇదే మందు!
సామాజిక దూరం పాటించడమే దీనికి సరైన మందు అని మహేశ్ బాబు చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. మన సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని.. సామాజిక దూరం పాటించడం ఇప్పుడు చాలా అవసరమని స్పష్టం చేశాడు. వాస్తవానికి ఇలా చేయడం చాలా కష్టమైన పని అయినప్పటికీ తప్పదన్నాడు. సామాజిక జీవితాన్ని త్యాగం చేసి సమాజ భద్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలని అభిమానులు, ప్రజలకు మహేశ్ సూచనలు చేశాడు.
ఇలా చేయండి..
అత్యవసరాలు తప్ప మిగిలిన సందర్భాల్లో ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి. తరుచుగా మీ చేతులను శుభ్రం చేసుకొండి. మీతో పాటు మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ హ్యాండ్ శానిటైజర్స్‌ను వాడండి. ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రమే మాస్క్‌లను ధరించండి. వైరస్ పూర్తిగా తొలగిపోయే వరకు ఈ జాగ్రత్తలు పాటిద్దాం’ అని మహేశ్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. కాగా.. సోమవారం సాయంత్రం ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియో రిలీజ్ చేసిన విషయం విదితమే. నటీనటులేమో పెద్ద పెద్ద పోస్ట్‌లు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అభిమానులు ఏ మాత్రం వీటికి రియాక్టయ్యి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని సేఫ్‌గా ఉంటారో వేచి చూడాల్సిందే మరి.