జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే డైరెక్టర్ క్రిష్ సినిమాలోనూ పవన్ నటిస్తున్నాడు. అయితే.. ఇంతవరకూ ‘వకీల్ సాబ్’కు సంబంధించి అప్డేట్స్ వచ్చాయ్ కానీ.. క్రిష్ మూవీకి సంబంధించి మాత్రం చిన్నపాటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో అసలు సినిమా నడుస్తోందా..? లేదా..? అనేదానిపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ లుక్ లీక్ అయ్యింది.
ఊర మాస్ లుక్‌లో!
ఈ లుక్‌లో పవన్ ఊరమాస్‌లాగా కనపడుతున్నాడు. కోరమీసాలు, నుదుటన నామంతో ఉన్న పవన్ లుక్‌గా ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇదే పవన్ తదుపరి సినిమా లుక్ అని కొందరు అంటుండగా.. కాదు కాదు.. ఇది ఫ్యాన్ మేడ్ అని మరికొందరు అంటున్నారు. అయితే.. ఈ లుక్‌ను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేయడంతో ఇది నిజమేనేమో అని అభిమానులు, జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇది నిజంగానే క్రిష్ సినిమాకు సంబంధించినదా..? లేకుంటే ‘వకీల్ సాబ్’ లుక్కేనా అనేది తెలియరాలేదు. కాగా.. ‘వకీల్ సాబ్’ విషయంలో కూడా ఇలానే సినిమా షూటింగ్ మొదటి రోజే లుక్ లీకయ్యింది. మరి ఈ లీక్ విషయంలో నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు.
ఇప్పటికే ఇలా పుకార్లు..
కాగా.. ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడని.. పాలమూరు పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. అంతేకాదు ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే డిఫెరెంట్ టైటిల్ పరిశీలనలో ఉందని విశ్వసనీయ వర్గదాల సమాచారం. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలానే పుకార్లు తెరపైకి వచ్చాయ్. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయ్. ఈ సినిమాకు ఆమె పాత్రే కీలకం అని.. ఆమె చుట్టూనే కథ తిరుగుతుందని పుకార్లొచ్చాయ్. మరోవైపు ఈ సినిమాలో కమెడియన్ అలీ కూడా నటిస్తున్నాడని వార్తలు వినిపించాయ్. తాను పవన్‌తో నటించడానికి రెడీగా ఉన్నా గానీ.. ఇంతవరకూ పిలుపు రాలేదని అలీ క్లారిటీ ఇచ్చుకున్నాడు.