ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన రెండు పెద్ద చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో బాక్సాపీసు వద్ద వసూళ్ల మోగించాయి. ఒక్కరోజు తేడాతో విడుదల అయిన ఈ రెండు చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. విడుదల కంటే ముందు నుండి సాగుతున్న ఈ పోటీ రిలీజ్ అయ్యాక మరింత జోరుగా సాగింది. కలెక్షన నంబర్ల నుండి ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకునే వరకు ఒకదానితో ఒకటి గట్టిగా పోటీ పడ్డాయి. అయితే ఆ కాంపిటీషన్ అంతటితో ఆగలేదు. ఈ రెండు సినిమాలు చాలా థియేటర్లలో నుండి దూరమైనా కూడా యాభైరోజుల సెలెబ్రేషన్స్ లో కూడా పోటీ కనిపించింది.
అయితే ప్రస్తుతం వీటి పోటీకీ బ్రేక్ పడింది. రెండు విజయవంతమైన చిత్రాలు మరికొద్ది రోజుల్లో వందరోజుల పండగని పూర్తి చేసుకోనున్నాయి. వందరోజుల పండగని ఎలా ప్లానింగ్ చేయాలా అని ఎవరికి వారు బాగానే ఆలోచించి పెట్టుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమా వందరోజులు ఆడటం కష్టమైపోయింది. అలాంటిది ఈ రెండు చిత్రాలు ఆ మార్కుని దాటుతాయని అనుకున్నారు. కానీ వీటి ఆశలకి ఎక్కడి నుండో వచ్చిన కరోనా పెద్ద దెబ్బే వేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తెలంగాణలో థియేటర్లన్నింటినీ ఈ నెల ౩౧ వరకి మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. దాంతో వంద రోజుల ఆశల మీద నీళ్ళు పడ్డాయి.