కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకీ మరింతగా పెరుగుతూంది. చైనాలోని వుహాన్ జంతువుల మార్కెట్ లో పుట్టిందని చెప్పబడుతున్న ఈ వైరస్ చాలా వేగంగా ప్రపంచ దేశాలకి వ్యాపించింది. చైనాలో కరోనా బారిన పడ్డ వ్యాధిగ్రస్థుల సంఖ్య లక్షకి చేరువలో ఉంది. చైనా తర్వాత కరోనా వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్న దేశం ఇటలీ. ఇటలీలో ఈ వ్యాధి మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది. చైనాలో కట్టడి చేస్తున్నా కూడా ప్రపంచ దేశాలకు చాలా ఫాస్ట్ గా ఈ వైరస్ విస్తరిస్తుండడంతో ఒక్కసారిగా అన్ని దేశాలు మేల్కొన్నాయి.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మనదేశంలో కేరళలో ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా స్కూళ్ళు, కాలేజీలు సహా థియేటర్లని మూసివేశారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే పద్దతి అవలంబిస్తున్నారు. కరోనా ప్రభావం రోజు రోజుకీ ఊహకి అందని రీతిలో పెరిగిపోతుండడంతో తెలంగాణ సర్కారు ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్ళు, థియేటర్లు ఈ నెల 31 వరకి మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. అసలే డ్రై మంత్ గా గడుస్తున్న మార్చ్ కరోనా కారణంగా పూర్తిగా డ్రైగా మారిపోయింది. ప్రభుత్వ నిర్ణయంతో చిత్ర నిర్మాతలు తమ సినిమాల విడుదల తేదీల్ని మార్పులు చేసుకుంటున్నారు.