అలవైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో చేస్తున్న సినిమా మీద అంచానాలు భారీగా ఉన్నాయి. రంగస్థలం వంటి భారీ హిట్ ఇచ్చిన రెండేళ్ల తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు సుకుమార్. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ లారీడ్రైవర్ గా కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తాడట.అల వైకుంఠపురములో అల్లు అర్జున్ గెటప్ కి పూర్తి భిన్నంగా గుబురు గడ్డంతో చూడగానే లారీ డ్రైవర్ గుర్తుకొచ్చేలా ఉంటాడట.
సుకుమార్ సినిమాల్లో హీరోలు చాలా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తారు. ఈ సినిమాలోనూ అల్లు అర్జున్ ఇది వరకు ఏ సినిమాలోనూ చూడని లుక్ లో కనిపిస్తాడట. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో సాగే కథ కోసం అల్లు అర్జున్ ఆ జిల్లా యాసని నేర్చుకుంటున్నాడట. పల్లెటూరి అమ్మాయిగా రష్మిక మందన్న లుక్ టెస్ట్ లో పాసయి హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం కొత్తవాళ్ళే కనిపిస్తారట. చిత్తూరు ప్రాంతానికి చెందినవారినే నటులుగా తీసుకున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సమకూరుస్తున్నారు.