ఒకప్పుడు దర్శకులు, రచయితలు వేరు వేరుగా ఉండేవారు. రచయితలు రాసిన దాన్ని దర్శకులు తమకి కావాల్సినట్టుగా తెరకెక్కించేవారు. అయితే కాలం మారుతున్న కొద్దీ సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు కోటు చేసుకున్నాయి. దర్శకులే తమ కథల్ని రాసుకుంటున్నారు. మరోలా చెప్పాలంటే రచయితలే దర్శకులుగా మారుతున్నారు. తెలుగులో ఇప్పుడున్న దర్శకులందరూ రచయితలే. అందరూ రచయిత నుండి దర్సకుడిగా మారినవారే.
అయితే అలా మారినవారందరూ దర్శకుడిగా మారిన తర్వాతే పేరు తెచ్చుకున్నారు. ఒక్క త్రివిక్రమ్ ని మినహాయిస్తే రచయితగా పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా తక్కువ. ఆ చాలా తక్కువలో మొదటగా కనిపించే పేరు వక్కంతం వంశీ. వక్కంతం వంశీ గతంలో కిక్, రేసుగుర్రం, టెంపర్ లాంటి చిత్రాలకి కథని అందించాడు. అందరు రచయితలు దర్శకుడిగా మారుతున్నట్లుగానే తాను కూడా అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారాడు.
కానీ ఆ సినిమా బెడిసికొట్టేయడంతో వంశీకి మళ్లీ దర్శకుడిగా అవకాశమే రాలేదు. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన నా పేరు సూర్య చిత్రం బాక్సఫీసు వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం వంశీకి మళ్ళీ దర్శకుడిగా అవకాశం వచ్చిందంటున్నారు. మాస్ రాజా రవితేజని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దర్శకుడిగా భారీ డిజాస్టర్ ని సొంతం చేసుకున్న వంశీ ఫ్లాపుల్లో ఉన్న రవితేజతో సినిమా చేస్తే లాభం ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో..!