2005 సంవత్సరంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు దర్శకులు, నిర్మాతలు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ‘‘నేనొక పది సినిమాల దాకా నిర్మించాను. ‘నిశ్శబ్దం’ సినిమాతో అనుష్కతో సన్నిహితంగా పనిచేసే అవకాశం లభించింది. అనుష్క మైల్ స్టోన్ ఈవెంట్ సందర్భంగా ఈ సినిమా విడుదల చేస్తుండటం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలుగు, హాలీవుడ్ నటులతో ఈ మూవీ డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు.
డైరెక్టర్ హేమంత్ మధుకర్ మాట్లాడుతూ, ‘‘అనుష్క ఒక నిగ్రహం ఉన్న విగ్రహం. రెండేళ్ల పాటు మాతో పాటు ఈ సినిమా కోసం తను సమయం వెచ్చించడం మామూలు విషయం కాదు. అది ఆమె అంకితభావం. మాపై నమ్మకం ఉంచినందుకు ఆమెకు థాంక్స్. ఈ పదిహేనేళ్ల జర్నీలో ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. వాటిలో ‘నిశ్శబ్దం’ కూడా ఒక మైలురాయి లాంటి సినిమా లాగా నిలబడుతుందని ఆశిస్తున్నా. అంజలి కూడా ఇప్పటి దాకా చేసిన క్యారెక్టర్లకు చాలా భిన్నమైన క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది. మాకు కావాలసిన అన్నింటినీ నిర్మాత విశ్వప్రసాద్ గారు సమకూర్చి పెట్టారు. ఆయన సపోర్ట్ ఇవ్వబట్టే ఈ సినిమాను నేను అనుకున్నట్లు చేయగలిగాను’’ అన్నారు.
అంజలి మాట్లాడుతూ, ‘‘ఐ లవ్ యూ స్వీటీ. నీది చాలా మంచి హృదయం. ‘నిశ్శబ్దం’ సెట్స్‌పై తొలిరోజు నాకు సౌకర్యంగా ఉంటుందా అనే ఫీలింగ్ ఉండేది. తనతో నాకు చాలా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తన పుట్టినరోజుకు ఒక పిక్చర్ పోస్ట్ చేశాను, అది తను నన్ను పైకి లేపిన పిక్చర్. ఆమె నుంచి అంత సౌకర్యం పొందాను. ఆమె ఇండస్ట్రీలో మరెన్నో ఏళ్లు ఉండాలి. ‘నిశ్శబ్దం’లో నన్ను భాగం చేసినందుకు అందరికీ థాంక్స్. నా కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ మూవీ. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా’’ అన్నారు.
డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి మాట్లాడుతూ, ‘‘స్వీటీ నాకు చాలా సన్నిహితురాలు, ఫ్యామిలీ ఫ్రెండ్. తను మంచి అబ్జర్వర్. ప్రతి విషయాన్నీ చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది. ‘విక్రమార్కుడు’ సినిమా చేసేటప్పుడు ప్రతి షాట్‌ను ఎలా చెయ్యాలో చేసి చూపించమనేది. నేను చేసి చూపిస్తే తను దాన్ని తనకు తగ్గట్లుగా మలచుకొని చేసేది. ఆఖరుకి రవితేజతో రొమాంటిక్ సీన్స్ కూడా యాక్ట్ చేసి చూపించమనేది. అలా అన్నీ నాతో చేయించింది. ఆ సినిమాలోనే మా కుటుంబం మొత్తానికి తను సన్నిహితురాలైంది. నాతో పాటు మా ఆవిడకూ, మా వదినకూ, మా పిల్లలకూ సన్నిహితమైపోయింది. నాకే సన్నిహితురాలేమోనని ఇంతదాకా అనుకుంటూ వచ్చాను. ఇక్కడకు వచ్చాక తెలిసింది, తను అందరికీ సన్నిహితురాలేనని. నా సినిమాల్లో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు పెద్దగా క్రియేట్ చెయ్యను. కానీ దేవసేన పాత్రను సృష్టించినందుకు గర్వంగా ఫీలవుతుంటాను. ఎందుకంటే దాన్ని స్వీటీ పోషించిన విధానం. చాలామంది హీరోయిన్లతో పనిచేస్తుంటాం, వాళ్లను చూస్తుంటాం. కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ఇష్టపడతాం. స్వీటీని ఒక నటిగా, ఒక మనిషిగా చాలా గౌరవిస్తాను. ఆ విషయంలో నా హృదయంలో ఆమెకో ప్రత్యేక స్థానం ఉంది. తను ఫెంటాస్టిక్ రోల్స్ చేసింది. ఇంకా చేస్తుందని నాకు తెలుసు. ‘నిశ్శబ్దం’ టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. ఆ సినిమా విడుదలయ్యే ఏప్రిల్ 2 కోసం ఎదురుచూస్తుంటా’’ అని చెప్పారు.
అనుష్క మాట్లాడుతూ, ‘‘సీనియర్స్ సాధించిన దానితో పోలిస్తే నేను సాధించింది చాలా తక్కువ. అయితే దీన్ని నేను ఓ బాధ్యతగా తీసుకొని ఇంకా హార్డ్‌వర్క్ చెయ్యాలి, ఇంకా మంచి స్క్రిప్ట్స్ చెయ్యాలనుకుంటాను. ‘సూపర్’ నుంచి ‘నిశ్శబ్దం’ వరకూ.. పూరి జగన్నాథ్ గారి నుంచి మొదలుకొని, ప్రతి సినిమా డైరెక్టర్‌కూ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నా. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమాపై నా నాలెడ్జ్ ఎలా ఉండిందో పూరి జగన్నాథ్ గారికి తెలుసు. ప్రతి సినిమా నాకొక మెట్టు. సహ నటులు, నిర్మాత, ప్రతి యూనిట్ మెంబర్‌తో ఒక ప్రయాణం చేస్తూ వచ్చాను. మంచి, చెడు అనుభవాలతో ఇక్కడి దాకా వచ్చాను. ఈ పదిహేనేళ్లలో నాతో కలిసి పనిచేసిన, ప్రయాణించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ‘నిశ్శబ్దం’ చిత్రం ఏప్రిల్ 2న వస్తోంది. ఒక భిన్నమైన చిత్రం అందించాలని మా వంతు ప్రయత్నం చేశాం. దీనికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇక్కడకు వచ్చి ఈ ఈవెంట్‌ను నాకు ప్రత్యేకమైనదిగా మార్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అన్నారు. నిశ్శబ్దం సహనిర్మాత వివేక్ కూచి భొట్ల ఈ వేడుక ఆద్యంతం వైభవంగా జరగటానికి ఏర్పాట్లను గత కొన్నిరోజులుగా దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ వేడుకలో నిర్మాత పొట్లూరి వరప్రసాద్, దర్శకులు శ్రీవాస్, వీరు పోట్ల కూడా మాట్లాడారు.