ఈ రోజుల్లో ఏ దర్సకుడికైనా సినిమాలు తీయడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. దాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడం కూడా ఇంపార్టెంట్. సినిమా తీసేశాం అయిపోయింది అని చేతులు ముడుచుకుంటే పని జరగదు ఇక్కడ. చాలా మంది కొత్త దర్శకులు చక చకా సినిమాలు తీసేస్తుంటారు. కానీ ప్రమోషన్లలో వెనకబడి మా సినిమాకి అన్యాయం జరిగిందంటూ వాపోతారు. అందుకే సినిమాకి ప్రమోషన్ చాలా ముఖ్యం.
అయితే ఒక్కో సినిమాకి ఒక్కోలా ప్రమోషన్స్ చేస్తుంటారు. పెద్ద సినిమాలకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనీ, ఆడియో ఫంక్షన్ అనీ, మ్యూజికల్ నైట్స్ అని చెప్పి ఏదో విధంగా సినిమాని జనాల నాలుకల్లో ఆడేలా చేస్తారు. అలాగే కొందరు తమ సినిమా కాన్సెప్ట్ నే క్రియేటివి ఉపయోగించి జనాల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఎవరు ఏది చేసినా ప్రేక్షకులని రప్పించడానికే. అయితే తాజాగా అనుష్క పదిహేను సంవత్సరాల సంబరం అట్టహాసంగా జరిగింది.
ఆ సంబరానికి టాలీవుడు అతిరథమహారథులందరూ వచ్చారు. అనుష్కని తెలుగు తెరకి పరిచయం చేసిన పూరి జగన్నాథ్ నుండి జక్కన్న, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, రాఘవేంద్రరావు మొదలగు వారందరూ ఈ వేడుకని వచ్చారు. అయితే ఇంత సడెన్ గా ఈ వేడుక నిర్వహించడానికి కారణం ఏముంటుందని ఒకసారి విశ్లేషిస్తే కొన్ని విషయాలు బయటపడతాయి. ఇటీవల అనుష్క తాజా చిత్రం నిశ్శబ్దం ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రం కోనఫిలిమ్ కార్పోరేషన్ బ్యానర్ లో తెరకెక్కిందని తెలిసిందే.
అయితే ఇటీవల రిలీజ్ అయిన ఈ ట్రైలర్ కి అనుకున్నంత స్పందన రాలేదు. అయితే దానికి రకరకాల కారణాలుండవచ్చు. ప్రస్తుతం జనాలకి సినిమా మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి, కరోనా వైరస్ భయాలు ఇలా రకరాల కారణాల వల్ల జనాలు నిశ్శబ్దం ట్రైలర్ ని పెద్దగా పట్టించుకోలేదన్నది వాస్తవం. అయితే నిన్నటి వేడుక వల్ల నిశ్శబ్దానికి బాగానే మైలేజ్ వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తానికి పదిహేను సంవత్సరాల సంబరం బాగానే వర్కౌట్ అయ్యేలా ఉంది.