2005 సంవత్సరంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు దర్శకులు, నిర్మాతలు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ... ‘‘ఈ బంగారుతల్లి ‘సూపర్’ సినిమా హీరోయిన్ కోసం బాంబే వెళ్లినప్పుడు దొరికింది. అన్నపూర్ణ స్టూడియోస్‌కి తీసుకెళ్లాను. నాగార్జునగారు తనను చూడగానే, ‘ఈ అమ్మాయ్ చాలా బాగుందే’ అన్నారు. ‘ఈ అమ్మాయికి ఆడిషన్ చేద్దాం సార్’ అన్నాను. ‘ఆడిషన్ ఏమీ అవసరం లేదు, పెట్టేద్దాం’ అని ఆయనన్నారు. అన్నపూర్ణ స్టూడియోలోనే వినోద్ బాల దగ్గర తను యాక్టింగ్ నేర్చుకుంది. డాన్స్ అవీ నేర్చుకొని సూపర్ ఎనర్జీతో ‘సూపర్’ ఫిల్మ్‌లో చేసింది. అంతకుముందు నాగార్జునగారు నీ పేరేంటని అడిగితే స్వీటీ అని చెప్పింది. ‘కాదు, నీ ఒరిజినల్ పేరు?’ అనడిగారు. స్వీటీయేనని, తన పాస్‌పోర్ట్ చూపించింది. అందులో ఆ పేరే ఉంది. ‘ఇలా కాదు, స్క్రీన్ నేమ్ మంచిది ఉండాలి’ అన్నారు నాగార్జునగారు. ఆ తర్వాత ఈ పిల్లకు ఏం పేరు పెడదామని చాలా పేర్లు రాసుకున్నాం. అప్పడు మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా ‘మిల మిల’ అనే పాట రికార్డింగ్ కోసం ఒక అమ్మాయిని పిలిపించాడు. ఆ అమ్మాయి పేరు అనుష్క. అది నాకు నచ్చి, ‘ఈ పేరు ఎలా ఉంది?’ అని స్వీటీని అడిగాను. ‘బాగానే ఉంది కానీ, నాగార్జునగారిని కూడా అడుగుదాం’ అంది. ఆయన్ని అడిగితే, మన హీరోయిన్లలో ఎవరికీ ఇలాంటి పేరు లేదు, పెట్టేయొచ్చన్నారు. అలా అనుష్క అనే నామకరణం జరిగింది. ‘సూపర్’తో స్టార్టయి, ‘నిశ్శబ్దం’తో పదిహేనేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంటోంది. యు రాకింగ్, లవ్ యు.. హ్యాట్సాఫ్. ఇందాక అనుష్క ఏవీ చూశాను. హీరోల ఏవీల కంటే చాలా బాగుంది. నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. అందరూ చెప్తున్నట్లే అనుష్కనిజంగా చాలా మంచిది. తన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. రవితేజ, చార్మి, నేను అనుష్కను ‘అమ్మా’ అని పిలుస్తాం. మేం కలిసినప్పుడల్లా తన కాళ్లకు దండంపెట్టి ఆశీర్వాదం తీసుకుంటాం. ఆమెలో కొన్ని లక్షణాలన్నా మాకు రావాలని కోరుకుంటుంటాం. చాలా మంచితనం, చాలా తెలివితేటలు కలిసిన కాంబినేషన్ అనుష్క. నా స్నేహితుడు హేమంత్ మధుకర్ తీసిన ‘నిశ్శబ్దం’ సినిమాను నేనిప్పటికే చూశాను. ఫెంటాస్టిక్ ఫిల్మ్. అనుష్క మూగమ్మాయిలా చేసింది. నిజంగా మూగదేమో అని నాకే డౌట్ వచ్చింది. ఈ అమ్మాయి ‘తెలీదు తెలీదు’ అని అన్నీ నేర్చుకొనే రకం. తనకు హ్యాట్సాఫ్. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలి అనుష్కా’’ అని చెప్పారు.
చార్మి మాట్లాడుతూ.. ‘‘అనుష్క ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను సీనియర్‌లా బిహేవ్ చేశాను. అప్పట్నుంచే తను పరిచయం. ఇవాళ తను నాకు అమ్మ. ఆమెలో ఎన్నో గొప్ప గుణాలున్నాయి. ఆమెలా ఉండటం చాలా కష్టం. సహనం, సమతుల్యం విషయంలో ఆమె అద్భుతం. 15 ఏళ్ల కెరీర్ అంటే జోక్ కాదు. ఈ కాలంలో ఆమె అద్భుతమైన పాత్రలు చేసింది. మొన్న ‘నిశ్శబ్దం’ చూశాం. అందులో అనుష్క తన నటనతో చింపేసింది. ‘నిశ్శబ్దం’ పెద్ద హిట్ కావాలని ప్రార్థిస్తున్నా. బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
రచయిత, నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘రాఘవేంద్రరావుగారు, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారు చెప్పినట్లు ఈ సినిమాలో క్యారెక్టర్ తనను వెతుక్కుంటూ వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియాగా చెయ్యాలనీ.. హాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్లతో చేయించాలనీ మా టీమ్ నిర్ణయించుకుంది. ఒక క్యారెక్టర్‌ను సౌత్, నార్త్‌లో తెలిసిన నటితో చేయించాలని అనుకుంటున్న టైమ్‌లో స్వీటీ నాకు బాంబే ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. అక్కడి సెక్యూరిటీ వాళ్లు తమ మెటల్ డిటెక్టర్స్‌ను పక్కనపెట్టి మరీ ఆమెతో ఫొటోలు దిగుతున్నారు. ఒకే ఫ్లైట్‌లో ప్రయాణించాం. హైదరాబాద్‌లో ల్యాండ్ అవ్వాల్సిన ఫ్లైట్‌ను అంతకుముందు అక్కడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందని చెన్నై తీసుకుపోయారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు ఫ్లైట్‌లోనే ఉండిపోయాం. ‘ఏంటి కోన గారూ, మీరేం చేస్తున్నారు?’ అనడిగింది. అప్పడు ఈ కథ చెప్పా. ఆమెను ఆ సినిమా కోసం అడగాలని చెప్పలేదు. ఏదో ఒకటి మాట్లాడుకోవాలి కాబట్టి చెప్పాను. తర్వాత తను వెళ్లిపోయింది. నేను హైదరాబాద్ తిరిగొచ్చాక స్వీటీ అయితే ఎలా ఉంటుందని హేమంత్‌ను అడిగాను. ‘ఇండియాలోనే అంతకంటే బెటర్ చాయిస్ దొరకదు సార్’ అన్నాడు. అప్పుడు ‘ఫుల్ స్టోరీ వింటావా?’ అని ఆమెకు మెసేజ్ పెట్టాను. అలా తను వినడం, ఈ ప్రాజెక్టులోకి రావడం.. అంతా ఆ దేవుడు డిజైన్ చేసినట్లు జరిగింది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది. పీక్స్‌లో అయితే మాగ్జిమమ్ ఐదేళ్లు ఉంటుంది. అలాంటిది 15 ఏళ్లు తన మార్క్‌నీ, తన మార్కెట్‌నీ పెంచుకుంటూ, నిలబెట్టుకుంటూ ఉందంటే తన టాలెంట్‌తో పాటు ఇంకేదో ఉండాలి. అదే స్వీటీ! క్యారెక్టర్ అంటే చాలా తపన పడుతుంది, టెన్షన్ పడుతుంది, చాలా హోమ్‌వర్క్ చేస్తుంది. సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటానంటే బేగంపేట్ స్కూల్ నుంచి టీచర్లు, ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ రెండు నెలల పాటు రోజూ స్వీటీ ఇంటికెళ్లి ఆమెకు దానిని నేర్పారు. ఇలా పాత్ర కోసం చాలా కష్టపడింది. తనకు ఏమీ తెలీదనుకోవడమే ఆమెలోని గ్రేటెస్ట్ క్వాలిటీ. ఇన్ని సినిమాలు చేసినా ఫ్రెష్ స్టూడెంట్ లాగానే ఫీలవుతుంది. అందుకే ఇంతకాలం ఉంది, ఇంకో పదిహేనేళ్లు ఇలాగే ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ట్రూ లేడీ సూపర్‌స్టార్ అనడానికి నిజంగా అర్హురాలు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందర్నీ సమానంగా చూసే గొప్ప గుణం ఆమెది. తన మీద ఒక పుస్తకం రాయొచ్చు. నిశ్శబ్దం ఆమెకు మంచి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైటర్‌గా ఇది నాకు 55వ చిత్రం. గర్వంగా చెప్తున్నా, ఇప్పటివరకూ నేను రాసిన బెస్ట్ స్క్రీన్‌ప్లే లలో ఇదొకటి’’ అని చెప్పారు.
నిర్మాత డి. సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘‘అనుష్క గురించి ఏం చెప్పను.. ‘సూపర్’ సినిమా టైమ్‌లో ఒక అందమైన అమ్మాయి అటూ ఇటూ నడుస్తుండటం చూశాను. ఆ తర్వాత తనతో కొన్ని సినిమాలు చేశాను. ఇండస్ట్రీలో చాలామందిని కలుస్తుంటాం. చాలా మంచి మనుషులు చాలా తక్కువమంది ఉంటారు. బహుశా హీరోయిన్లలో అనుష్క లాంటి నైస్ పర్సన్ ఇంకొకరు ఉండరు. నిజంగానే తను స్వీట్ గాళ్, గుడ్ గాళ్, గొప్ప హృదయం ఉన్న అమ్మాయి. అలాంటి హృదయం ఉన్నవాళ్లు అరుదు. మున్ముందు ఆమె జీవితం మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు.