2005 సంవత్సరంలో వచ్చిన ‘సూపర్’ సినిమాతో ప్రారంభించి నటిగా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుష్క 15 ఏళ్ల కెరీర్ ఈవెంట్‌ను చిత్ర బృందం గురువారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు దర్శకులు, నిర్మాతలు, అనుష్క స్నేహితులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘‘తొలిసారి స్వీటీని చూడటం ఒక ఎక్స్‌పీరియెన్స్. ‘శ్రీరామదాసు’ తీసేప్పుడు నాగార్జున గెస్ట్ హౌస్‌కు వెళ్లాను. ఆయన ‘డైరెక్టర్‌గారూ సరైన టైమ్‌కు వచ్చారు. మీకో కొత్త హీరోయిన్‌ను చూపించాలి’.. అని చెప్పి, ‘స్వీటీ’ అని పిలిచాడు. సెల్లార్ నుంచి మెట్లెక్కుతూ వచ్చింది. మొదట కళ్లు, తర్వాత ముఖం, ఆ తర్వాత మనిషి పైకి వచ్చి నిల్చుంది. అప్పుడు ఆమెతో అన్నాను.. ‘నువ్వు సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ అవుతావ్ స్వీటీ’ అని చెప్పాను. ఇవాళ నిన్ను చూసి గర్వపడుతున్నాను. ఆరోజు అక్కడ ఎలాగైతే మెట్లెక్కి వచ్చావో, అలాగే బంగారు మెట్లెక్కుతూ కెరీర్‌లో ముందుకు వచ్చావు. పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఫస్ట్ పిక్చర్ చేశావు. హీరోయిన్లను పూరి ఎలా చూపిస్తాడో అందరికీ తెలిసిన విషయమే. ‘సూపర్’ అనిపించావ్. ఆ తర్వాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కోడి రామకృష్ణ కాంబినేషన్‌తో చేసిన ‘అరుంధతి’తో నీకు గజకేసర యోగం పట్టింది. అప్పుడే ఏనుగును ఎక్కేశావ్. ఆ తర్వాత ‘భాగమతి’, గుణశేఖర్ సినిమా ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’లో దేవసేనగా హంసవాహనం ఎక్కి ఆకాశంలోకి వెళ్లిపోయావ్. ఆ సినిమాలో ‘ఊపిరి పీల్చుకో’ అని నువ్వు చెప్పిన డైలాగ్‌తో దద్దరిల్లిపోయింది. నా సినిమా ‘నమో వెంకటేశాయ’లో ఒక భక్తురాలిగా చేశావ్. ప్రయత్నిస్తే సినిమాలు దొరుకుతాయ్. కానీ నీ విషయంలో క్యారెక్టర్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చాయ్. ఈ జనరేషన్‌లోని మరే హీరోయిన్‌కీ ఆ అదృష్టం దక్కలేదు. నీ కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్లను పొందావు. ‘అనుష్క చాలా మంచిది, అందుకే ఆ క్యారెక్టర్లు వచ్చాయి’ అని అందరూ చెప్పే విషయమే. అందరినీ నీ కుటుంబంలా చూసుకుంటావ్. తెలుగులోనే కాకుండా తమిళనాడులో, కర్ణాటకలోనూ ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న నీ జన్మ ధన్యం. నీకూ, నాకూ దగ్గర పోలిక ఉంది. నన్ను ‘మౌన ముని’ అని పిలిచేవారు. నువ్వు ఈ ‘నిశ్శబ్దం’ సినిమాతో మౌన మునికన్యగా అయిపోతావ్. డైరెక్టర్ హేమంత్ ఈ సినిమా కథ నాకు చెప్పాడు. ఆ క్యారెక్టర్ ఎలా చేసుంటావో చెప్పాల్సిన అవసరం లేదు. నీ సామర్థ్యం నాకు తెలుసు. హేమంత్ వెరీ గుడ్ డైరెక్టర్. నిర్మాతలు నాకు బాగా తెలుసు. ఈ పిక్చర్ పెద్ద హిట్టవ్వాలి’’ అని చెప్పారు.
నిర్మాత ఎం. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘అనుష్క జీవితాన్ని మార్చేసిన సినిమా ‘అరుంధతి’ అని అందరూ అంటుంటారు కానీ, ఆ సినిమాతో నా జీవితాన్ని మార్చేసిన నటి తాను అని నేనంటాను. ఆ మాటకు నేను కట్టుబడి ఉంటాను. తన స్నేహితులకు ఆమె ఆనందాన్ని కలిగిస్తుంది. అవసరం అనుకున్నప్పుడల్లా ఆమె స్నేహితుల దగ్గర ఉంటుంది. వాళ్ల బాధలు వింటుంది. వాళ్ల ఆనందాన్నీ, విజయాల్నీ సెలబ్రేట్ చేస్తుంది. ఆమె కుడిచేత్తో చేసే సాయం ఎడమ చేతికి కూడా తెలీదు. ఆమె తన సొంత కుటుంబాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నా. ‘నిశ్శబ్దం’ టీమ్‌కు మంచి జరగాలని ఆశిస్తున్నా’’ అన్నారు.
డైరెక్టర్ వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘మా ‘దేవదాసు’ సినిమా కోసం బాంబేకి వెళ్లి ఇలియానాను హీరోయిన్‌గా సెలక్ట్ చేసుకుని, అగ్రిమెంట్లు కుదుర్చుకొని, ఇలియానా, వాళ్లమ్మతో కలిసి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు వస్తున్నాను. వాళ్లిద్దరూ నా వెనుక సీట్లలో కూర్చున్నారు. నా ముందు సీట్లో చక్కని రూపలావణ్యాలు ఉన్న ఒక అమ్మాయి వచ్చి కూర్చోవడం రెప్పపాటు కాలంలో చూశాను. పేరడిగితే స్వీటీ శెట్టి అని చెప్పింది. నంబర్ అడిగి తీసుకున్నా. ‘సూపర్’లో ఆమె బాగున్నప్పటికీ, ‘విక్రమార్కుడు’తో ఆమెకు మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత నా ‘ఒక్క మగాడు’ చేసింది. ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ ఇవాళ ఎంతో ఎత్తుకు ఎదిగారు. మంచి విగ్రహం కల ఒక అమ్మాయికి మంచి కళ్లు, మంచి ఎక్స్‌ప్రెసివ్ ఫేస్ దేవుడు ఇస్తే పాత్రలు వెతుక్కుంటూ వస్తాయి. అనుష్క దగ్గరకు అలా పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. మంచితనంతో, ఓపికతో ఆ పాత్రలకు జీవంపోసి ఇవాళ ఆమె ఈ స్థాయిలో ఉన్నారు. అనుష్క గురించి ఎవరు చెప్పినా ముందు చెప్పేది ఆమె మంచితనం గురించి. మనిషిని మనిషిలా చూడ్డం ఆమెలోని గొప్ప గుణం. ఆమెకు మంచి జీవిత భాగస్వామి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ‘నిశ్శబ్దం’ టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ట్రైలర్ చూశాక కచ్చితంగా ఈ సినిమా ఏదో చెయ్యబోతోందని అనిపించింది. హేమంత్‌కు బ్రహ్మాండమైన బ్లాక్‌బస్టర్ వస్తుందని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.