టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. తన సినీ కెరీర్‌లో ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డాడో..? కొణిదెల శివ శంకర వర ప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా ఎలా ఎదిగారో చాలా తక్కువ మందికే తెలుసు. మరీ ముఖ్యంగా ఆయన్ను అభిమానించే అభిమానులకు పెద్దగా తెలియదు. అయితే.. చాలా వరకు అసలు ఆయన ఈ రేంజ్‌కు ఎలా వచ్చారు..? పెద్ద పెద్ద స్టార్‌లు టాలీవుడ్‌కు ఉన్నప్పటికీ ఈయన మెగాస్టార్‌కు ఎలా ఎదిగారు..? అనేది ఎవరికీ అర్థం కాదు.. ఆయన బయోపిక్ లేదా ఆయన జీవితంపై పుస్తకం వస్తే తప్ప.. చిరును లోతుగా అర్థం చేసుకోలేం.
అయితే.. సింప్లిసిటీ, గర్వం లేకపోవడమే చిరును ఈ రేంజ్‌కు తెచ్చిందని మాత్రం కచ్చితంగా చెప్పగలం. అంతేకాదు.. మనసులో ఉన్న మాటను బయటపెట్టేసి కుండ బద్ధలు కొట్టడం కూడా చిరు కెరీర్‌కు ఓ ప్లస్ పాయింట్‌గా ఉంది. అప్పుడప్పుడూ స్టేజ్‌పైన తాను పడ్డ కష్టాలను పంచుకుంటూ ఉంటాడు. కాగా.. ప్రస్తుతం సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా తనను పిలిచిన ప్రతీ ఫంక్షన్‌కు వెళ్లి పెద్దన్నగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చిరు పంచుకున్నాడు.
ఇదే కదా చిరు అంటే..!
‘నన్ను ఎవరైనా పొగిడినా.. ప్రశంసించినా పొంగిపోను. నేను ఇప్పటికీ నేలపైనే పడుకుంటాను.. అలా చేస్తే గర్వం రాదని నమ్ముతాను. మరీ ముఖ్యంగా నాపై ఎవరైనా ప్రశంసల జల్లు కురిపిస్తే అస్సలు అది నా గొప్పతనం కాదు.. సినిమా విషయంలో ప్రశంసిస్తే.. నాతో పాటు ఆ సినిమా యూనిట్‌కు అందరికీ అది వర్తించాల్సిందే. సినిమా అంటే హిట్, ప్లాప్ అనేది కాదు.. ఏదైనా సరే దాని వెనుక సినిమా యూనిట్ కష్టం కచ్చితంగా ఉంటుంది. హిట్టయితే ప్రశంసలు.. ప్లాప్ అయితే విమర్శలు ఈ రెండు కూడా సమిష్టిగా నేను స్వీకరిస్తాను. ఈ విషయంలో మాత్రం నేను చాలా నిజాయితీగా ఉంటాను’ అని చిరు చెప్పుకొచ్చాడు. కాగా.. మెగాస్టార్ నోట ఈ మాటలు విన్న అభిమానులు పొంగిపోతున్నారు. ‘ఇదే కదా చిరును మెగాస్టార్‌ను చేసింది..!’ అని చెప్పుకుంటున్నారు. చిరు మాట్లాడిన మాటలకు సంబంధించి వార్తలను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఎంతైనా చిరు అంటే అంతే మరి.