‘ఢీ’ సీక్వెల్‌కు సన్నాహాలు.. మరి ఆ రెండు క్యారెక్టర్లు చేసేదెవరు?
మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఢీ’ (2007) సినిమా ఎంత సూపర్ హిట్టయ్యిందో మనకు తెలుసు. విష్ణుకు ఆ సినిమా లైఫ్ నిచ్చింది. మెగాస్టార్‌తో చేసిన ‘అందరివాడు’ చిత్రం తర్వాత రెండేళ్ల పాటు నానా కష్టాలు పడి తీసిన ఈ సినిమాతో తానేమిటో శ్రీను వైట్ల నిరూపించుకున్నాడు. ఆ సినిమా నుంచే ఓ పదేళ్ల పాటు ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఆ సినిమాలోని పంచ్ డైలాగ్స్ ప్రేక్షకుల్ని ఎంతగా నవ్వించాయో! ఇప్పటికే ‘రావుగారూ నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి’ అనే బ్రహ్మానందం డైలాగ్ మన చెవుల్లో రింగుమంటూనే ఉంది. పదమూడేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్స్ జరుగుతున్నాయి. మంచు విష్ణుతోటే ఆ సీక్వెల్‌ను తియ్యడానికి శ్రీను వైట్ల స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు.
బుధవారం విష్ణు చేసిన ఒక ట్వీట్ ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది. ‘‘చాలామంది నాకు ఫోన్ చేసి, ‘ఢీ 2’ శ్రీను వైట్ల గారి డైరెక్షన్‌లో స్టార్ట్ అవుతుంది అని కంగ్రాట్స్ చెప్పారు. నాకు అన్న లాంటి శ్రీను వైట్ల గారిని అడిగితే బెటర్. ప్రాజెక్ట్ డీటైల్స్ వరకు నన్ను ఇన్‌వాల్వ్ చెయ్యకండి’’ అని ఆయన ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఆయన ఊరకనే చెయ్యలేదనీ, ‘ఢీ 2’ వస్తుందనే సంకేతం ఇచ్చేందుకు ఆ ట్వీట్ చేశాడనీ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతే కాదు, ఆ ట్వీట్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూడాలని ఆయన భావించాడు. ఆయన ఊహించినట్లే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘ఢీ’ సీక్వెల్ చేస్తే చాలా బాగుంటుందనీ, తప్పకుండా చెయ్యమనీ చాలామంది కామెంట్లు పెట్టారు. అంతే కాదు, బ్రహ్మానందం పాత్రకు వెన్నెల కిశోర్‌తో చేయిస్తే బాగుంటుందని కూడా సలహాలు ఇచ్చారు.