ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఓ డియర్’ షూటింగ్ ప్రస్తుతం యూరప్‌లో జరుగుతోంది. అక్కడ అందమైన చేజింగ్ సీన్‌ను ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్‌తో తీశామని డైరెక్టర్ ట్విట్టర్ వేదికగా తెలిపాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఎలాగైనా 2020లోనే విడుదల చేయాలని ఆ సంస్థలు నిర్ణయించాయి. ఇదివరకు ఈ సినిమా ఈ ఏడాది వచ్చే అవకాశాలు కనిపించడం లేదనీ, 2021 వేసవిలో వచ్చే అవకాశాలు ఉన్నాయనీ ప్రచారంలోకి వచ్చింది.
అయితే ఇప్పుడు టాలీవుడ్‌లోని అన్ని నిర్మాణ సంస్థలూ కాస్ట్ కటింగ్‌పై దృష్టి సారిస్తున్నాయి. వీలైనంత తక్కువ రోజుల్లో సినిమాని పూర్తిచేసి, ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అందుకు అనుగుణంగానే 2020 దీపావళికి ‘ఓ డియర్’ సినిమాని రిలీజ్ చేయడానికి ప్రభాస్ బృందం సన్నాహాలు చేస్తోంది. దీపావళి నవంబర్ 14న వస్తోంది. ఆ రోజు శనివారం కాబట్టి గురువారం.. అంటే, నవంబర్ 12న ‘ఓ డియర్’ను రిలీజ్ చెయ్యాలనేది నిర్మాతల ఆలోచన. ఈ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్ లోగా ఫినిష్ చేయనున్నారు. ఒకవేళ దీపావళికి సినిమా రెడీ కాకపోతే డిసెంబర్‌లో క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని కూడా నిర్మాతలు భావిస్తున్నారు.
అందమైన ప్రేమకథకు యాక్షన్ మేళవించి రూపొందిస్తోన్న ఈ సినిమాకు ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండటం వల్ల దీపావళికి రిలీజ్ చేయడమే కరెక్ట్ అనేది ప్రభాస్ ఆలోచన. బాలీవుడ్‌లో ఆ సమయంలో విడుదలకు అవకాశం ఉన్న ఒకే ఒక భారీ సినిమా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ‘పృథ్వీరాజ్’. అయితే దాని రిలీజ్ డేట్‌ను ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. డిసెంబర్ 25న మాత్రం అమీర్‌ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల కానుంది. అందువల్ల దానితో పోటీపడటం కంటే ‘పృథ్వీరాజ్’తో పోటీపడటమే బెటర్ అని చిత్రయూనిట్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.