కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతుండటంతో అన్ని దేశాల ప్రభుత్వాలూ ఆ వైరస్‌పై ప్రజలను చైతన్యం చేసేందుకు కృషి చేస్తున్న విషయం గమనిస్తున్నాం. మనదేశానికి వస్తే, ప్రజలు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా హీరో విజయ్ దేవరకొండతో ఒక యాడ్‌ను రూపొందించి విడుదల చేసింది. కరోనా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అందులో విజయ్ వివరంగా చెప్పుకొచ్చాడు. దానినే తన ట్విట్టర్ ఎకౌంట్‌లోనూ పోస్ట్ చేశాడు.
సాధారణంగా విజయ్ అంటే మనకు 'అర్జున్‌రెడ్డి', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాల్లోని క్యారెక్టర్లు గుర్తుకు రావడం సహజం. విజయ్ యాటిట్యూడ్ కూడా అదే తరహాలో ఉంటుందనేది ఫ్యాన్స్ నమ్మకం కూడా. అతని సొంత క్లాతింగ్ లైన్ పేరు కూడా రౌడీ వేర్ కావడం గమనార్హం. అందుకనే అతడిని రౌడీ హీరో అని పిలవడం కామన్ అయిపోయింది. అలాంటిది.. చాలా ఒద్దికగా అతడు కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంటే ఫ్యాన్స్ భిన్నంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది 'అన్నా.. నువ్వు ఏం చెబితే అది చేస్తాం' అంటే, చాలా మంది 'ముందు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్' అని అతడికే సలహా ఇవ్వడం గమనార్హం.
కొంతమందైతే 'అన్నా నువ్వు కూడా సినిమాల్లో లిప్‌లాక్స్ ఆపేయ్' అని కూడా చెప్పారు. ఇంకొంతమంది అర్జున్‌రెడ్డి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో విజయ్ పాల్గొన్న ఇంటిమేట్ సీన్స్ ఫొటోలను షేర్ చేసి 'అన్నకు బెడ్ సీన్స్ ఇంపార్టెంట్' అని క్రూర పరిహాసం ఆడారు. సినిమా వేరు, నిజ జీవితం వేరు అని మనందరికీ తెలుసనీ, సామాజిక బాధ్యతగా కరోనా వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన విజయ్‌ను అభినందించాల్సింది పోయి ఇలా పరిహాసం ఆడటం తగదని ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు.