మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబో సినిమా షూటింగ్ సుమారు సగం పూర్తి కావొచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే షూటింగ్ పూర్తి చేసి.. చిరు పుట్టిన రోజున మెగా ఫ్యాన్స్‌కు కానుక ఇవ్వడానికి కొరటాల విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అధికారిక ప్రకటన కంటే ముందే.. పొరపాటున చెప్పేశాడో.. చెప్పాల్సిన టైమ్ కాబట్టి చెప్పేశారో కానీ చిరు మాత్రం ‘ఆచార్య’ అని టైటిల్‌ను రివీల్ చేసేశాడు. అయితే.. ప్రస్తుతం యంగ్ మెగాస్టార్ పాత్రకు ఎవర్ని తీసుకోవాలనే దానిపై ఇంకా కన్ఫూజన్ కొనసాగుతోంది. అది కాస్త క్లారిటీ వచ్చేస్తే సినిమా షూటింగ్ దాదాపు అయిపోతుందట.
యంగ్ మెగస్టార్ ఎవరనే ఉత్కంఠకు తెరపడకమునుపే మెగా ఫ్యాన్స్‌లో మరో టెన్షన్ మొదలైందని అటు సోషల్ మీడియాలో.. ఇటు మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన అక్రమాలపై పోరాటం చేసే పాత్రలో నటిస్తారని ఎప్పట్నుంచో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఈ పాత్రే పెద్ద సమస్య కానుందట. ప్రస్తుతం హిందువులు అంటే ఎక్కువ శాతం బీజేపీకి సపోర్ట్ చేస్తున్నవారే అనే ఓ అపోహ జనాల్లో ఉంది. అయితే చిరు ఇలా నటించడం.. అవినీతిని ఎండగట్టడంను బట్టి చూస్తే.. పాత్రతో పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలిపినట్లు అవుతుందని.. ఇదే జరిగితే నిజమైన ఫ్యాన్స్‌తో పెద్ద తలనొప్పేనని.. అంతేకాదు కొన్ని వర్గాల నుంచి కచ్చితంగా పెద్ద సమస్యగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారట.
అందుకే ముందు జాగ్రత్తగా స్టోరీని బ్యాలెన్స్ చేయాలని కొరటాలకు చిరు సలహా ఇచ్చారట. ఈ మేరకు కథలో కొన్ని కొన్ని మార్పులు చేర్పులు తప్పక చేయాల్సిందేనని.. కొరాటాల కాస్త షూటింగ్‌కు గ్యాపిచ్చి కథ అల్లడం మొదలుపెట్టాడట. ఏదైతేనేం సినిమా రిలీజ్ కాకమునుపే ముందుగానే గ్రహించి కొరటాల మంచి నిర్ణయమే తీసుకుంటారట. అయితే ఇప్పటి వరకూ కథ అంతా ఓకే.. కథ మారిస్తే ఎలా ఉంటుందనే మరో టెన్షన్ సైతం మెగాభిమానుల్లో మెదులుతోందట.