టాలీవుడ్‌లో కొన్ని కొన్ని సినిమాలు, పాటలు మనమెప్పుడూ మరిచిపోలేం.. రోజూ కాకపోయినా అప్పుడప్పుడు అయినా ఆ పాటలు వినాలనిపిస్తుంది.. అలాంటి సినిమాలు చూడాలనిపిస్తుంది. ఇలా ఎవరి అభిరుచులు వాళ్లకు ఉంటాయ్.. మరి అలాంటి పాటలు, సినిమాలను చంపేస్తూ చిత్ర విచిత్రాలుగా సాంగ్స్‌ను వాడేస్తే ఎలా ఉంటుంది..? ఆ పాటలను కామెడీ షోలో చిల్లర చిల్లరగా వాడేస్తే ఎంత చిరాకు పుడుతుంది..? కామెడీ పేరుతో ఎలా పడితే అలా సినిమా పాటలను వాడేస్తే ఎలా ఉంటుంది..? కామెడీని కామెడీగానే చేయాలే తప్ప.. మరీ చిల్లరగా చేస్తే ఎలా ఉంటుందో ఇక మాటల్లో చెప్పలేం.
కాస్త ఆలోచించండి..
ఇక అసలు విషయానికొస్తే.. తెలుగులో కామెడీ షోలు చాలానే ఉన్నాయ్.. వాటిలో ప్రత్యేకించి ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఆ ఆర్ఆర్ ఏంటో..? మధ్య మధ్యలో ఆ పాటలేంటో సదరు యాజమాన్యానికి.. ఎడిటింగ్ చేసే ఎడిటర్‌కు, డైరెక్టెర్‌కే తెలియాలి. అసలు ఎంతో ప్రాధాన్యత ఉన్న పాటలను తీసుకొచ్చి.. చిల్లర సీన్లకు వాడేయటం.. ఏవేవో మ్యూజిక్స్ వాడేయటం.. చేసేస్తున్నారు. ఏమైనా అంటే కామెడీ కదండి.. కామెడీగానే చూడాలంటారు.. అంతేకాదు.. ఈ పాత్రలు, కథలు ఎవర్నీ ఉద్దేశించినవీ కావంటూరు. కామెడీగా చేస్తే చూస్తారు తప్ప.. ఇలా చిల్లరగా చేస్తే సదరు వీక్షకునికి ఎలా ఉంటుందనేది ఒకట్రెండు సార్లు ఎంతైనా ఆలోచించాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వాళ్లే గానీ చూస్తే..!
మరీ ముఖ్యంగా ఇటీవల ఎపిసోడ్‌లో మాస్ అవినాష్, కెవ్వు కార్తిక్ టీమ్‌లో ‘అరుంధతీ’, ‘కాంచన’, ‘చంద్రముఖి’ ఇలా రెండు మూడు సినిమాలను కలిపి స్కిట్ చేసేశారు. అసలు అందులో వచ్చే సాంగ్స్ ఏంటో.. సీన్స్ ఏంటో ఆ టీమ్‌కే తెలియాలి.. ఆ బట్టలు ఉతుకుడు ఏంటో.. బట్టలు పిండుడు ఏంటో..? తోమ్ తోమ్ అన్నప్పుడు ఆ గిన్నెలు తోముడు ఏంటో..?.. నిజంగా ఆ ఒరిజనల్ సాంగ్‌కు పాడిన, చూసిన, తెరకెక్కించిన దర్శకుడు గానీ ఈ స్కిట్ చూస్తే నిజంగా వామ్‌థింగ్ వచ్చేస్తుందేమో. అసలు ఆ ఒరిజినల్ సాంగ్‌కు అర్థం, పరమార్థం ఏంటి..? మీరు అలాంటి పాటలను వాడటమే పెద్ద తప్పయితే.. దాన్ని మరీ ఇంతలా వెటకారంగా వాడటం అంతకంటే పెద్ద తప్పు.. మీకు ఏ ఆదిత్య నుంచో.. ఇంకో మ్యూజిక్ నుంచో అనుమతి ఉండొచ్చుగాక.. మరీ ఇలా చేయడం ఎంతవరకు సబబు అని సదరు ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఈ ఒక్క స్కిట్ అనే కాదు.. చాలా మంది అసభ్యంగా చేసేస్తున్నారు.
చంపేయకండ్రా అయ్యా..!
స్కిట్ చేసేసి.. ప్లే చేసేసి.. యూ ట్యూబ్‌లో పడేసి చేతులు దులిపేసుకోవడం కాదండోయ్.. కాస్త కింద వచ్చే కామెంట్స్ కూడా చూస్తే తమరి స్కిట్.. యాజమాన్యంపై ఏ మాత్రం బూతుల వర్షం కురిపిస్తున్నారో అర్థమవుతుంది. కామెడీ చేయండి కానీ.. మీ కామెడీతో సినిమాలను చంపకండ్రా అయ్యా.. కాస్త కొత్తగా.. వెరైటీగా బుర్రకు పనిపెట్టి స్కిట్ చేసి సక్సెస్ అవ్వండి.. అలాగని జబర్దస్త్‌లో మంచి రైటర్స్ లేరా అంటే.. అద్భుతమైన వాళ్లు ఉన్నారు. అందుకే మీ బుర్రకు మరింత పదునుపెట్టి మరీ కొత్తగా ఆలోచించండి అంతేకానీ.. చిల్లర కామెడీ వద్దు.. అలాంటి సాహసాలు ఇక మీదట చేయకండి.. అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.