సౌత్ ఇండియా మొత్తంలోనే ‘కింగ్ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్స్’ గా పేరు పొందిన మహేష్ చేతిలో తాజాగా మరో పెద్ద బ్రాండ్ వచ్చి చేరింది. ఇప్పటికే 22 బ్రాండ్లకు అంబాసిడర్‌గా పనిచేసిన ఆయన ‘కార్ దేఖో’కు పనిచేయనున్నాడు. కార్ల అమ్మకాలలో టాప్‌లో ఉన్న ఆ సంస్థ తమ బ్రాండ్‌ను ఎండార్స్ చేసే పనిని మహేష్‌కు అప్పగించింది. ఇవాళ బడా సంస్థలన్నీ తమ విలువను మహేష్ మరింత పెంచుతాడని నమ్ముతున్నాయనడానికి ‘కార్ దేఖో’ ఎండార్స్‌మెంట్ మరో ఉదాహరణ. త్వరలోనే కార్ దేఖో యాడ్‌లో ఆయన నటించనున్నాడు.
దక్షిణ భారతదేశంలో టాప్ కార్పొరేట్ కంపెనీలన్నీ తమ మోడల్‌గా మహేష్‌నే ఫస్ట్ చాయిస్‌గా ఎంచుకుంటున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కారణం, ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్ చేసే విషయంలో తోటి అనేకమంది సెలబ్రిటీల కంటే ఆయన ముందుండటమే. నాలుగైదేళ్ల క్రితం ఒక ఎండార్స్‌మెంట్‌కు ఏడాదికి 3 కోట్ల రూపాయలు ఆర్జించే ఆయన ఇప్పుడు మరింత ఆర్జిస్తున్నట్లు సమాచారం. కేవలం ఎండార్స్‌మెంట్ల రూపంలోనే ఆయన ఏడాదికి 30 నుంచి 35 కోట్ల రూపాయలకు పైగానే సంపాదిస్తున్నట్లు సమాచారం.
ఇటీవలి కాలంలో అభీబస్, యుప్‌టీవీ, ప్రోటీనెక్స్ వంటి బ్రాండ్లను ఎండార్స్ చేసే బాధ్యతలు చేపట్టాడు మహేష్. ట్రేడ్ అంచనాల ప్రకారం మహేష్ వల్ల ఆయా బ్రాండ్ల అమ్మకాలు, విలువ బాగా పెరిగాయి. అందుకే పెద్ద పెద్ద బ్రాండ్ల చూపులన్నీ ఆయన మీదే ఉంటున్నాయి. మరో వైపు యాక్టర్‌గా సూపర్ స్టార్‌డమ్‌ను మహేష్ ఎంజాయ్ చేస్తుండటం మనకు తెలిసిందే. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టడం ద్వారా ఆయన బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగింది. ఏఎంబీ సినిమాస్‌తో మల్టీప్లెక్స్ రంగంలో దిగ్విజయంగా అడుగుపెట్టిన ఆయన హంబుల్ కో అనే సొంత క్లాతింగ్ లైన్‌ను స్టార్ట్ చేసి, అందులోనూ సక్సెస్ అయ్యాడు. తాజాగా పర్‌ఫ్యూమ్ రంగంలోనూ అడుగుపెట్టి, సొంత సిగ్నేచర్ బ్రాండ్‌ను నెలకొల్పే పనిలో మహేష్ ఉన్నాడని వార్తలు వస్తున్నాయి.