కరోనా గురించి ప్రతీ ఒక్కరిలో ఆందోళన కలుగుతున్న మాట నిజం. ప్రభుత్వం ఎంత భయపడవద్దని చెబుతున్నా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల కారణంగానో, మీడియా చూపిస్తున్న హంగామా కారణంగానో ప్రజల్లో భయం మరింతగా ఎక్కువైంది. చైనాలో పుట్టిందని చెప్పుకుంటున్న ఈ కరోనా వైరస్ మనదేశంలో మొదటగా కేరళకి చెందిన యువకుడిలో ఉందని కనిపెట్టారు.
ఆ యువకుడు చైనా నుండే వచ్చాడని సమాచారం. అయితే కేరళని తాకిన కరోనా వైరస్ హైదరాబాద్ ని కూడా చేరింది. దాంతో ఒక్కసారిగా ప్రభుత్వం, ప్రజలు అలర్ట్ అయ్యారు. కరోనా వ్యాధిగ్రస్థులు మరింతగా పెరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించడమే కాదు అందుకు కావాల్సిన ప్రచారం కూడా కల్పిస్తున్నారు. అయితే కేరళ ప్రభుత్వ ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేసింది.
ఈ నెల 31 వ తేదీ వరకు కేరళలో అన్ని స్కూళ్ళు, థియేటర్లని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాధిగ్రస్థులు మరింత పెరగకుండా ఉండేందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. ఈ నిర్ణయం తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.