అన్నపూర్ణమ్మ గారి మనవడు నాకు ప్రత్యేకం - అన్నపూర్ణమ్మ
చిత్రసీమలో నన్నంతా గౌరవంగా చూస్తారు ‘అమ్మబాగున్నావా? అని నవ్వుతూ పలకరిస్తారు అమ్మా అన్నారంటే గౌరవం! అంతకుమించిన గౌరవం ఏముంటుంది? ఆరేళ్ల పిల్లాడి నుండి అరవై ఏళ్ల వ్యక్తి వరకూ అందరూ నన్ను గుర్తుపడతారు అంతకు మించిన అవార్డు ఏముంటుంది’ అని అన్నారు అన్నపూర్ణమ్మ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు.’ మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలో నటించాడు నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎంఎన్ఆర్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మీడియాతో మాట్లాడారు.
కథలో మీకు నచ్చిన అంశాలు?
- తొలిసారి నా పేరు మీద ఓ సినిమా వచ్చింది. ఆనందమే కదా! కథాంశం విషయానికి వస్తే... ‘నేను పని చేస్తా అని ఓ పిల్లాడు ఇంటికొస్తాడు. అతడు నా మనవడే. కానీ, నాకు తెలియదు. ఆ పిల్లాడికి తెలుసు. ఇంట్లో వాళ్లకు పిల్లాడు నచ్చక, ఛాడీలు చెప్తారు. పిల్లాడు దూరమైన తర్వాత అతడు మనవడు అని తెలుస్తుంది. తర్వాత అందరం ఎలా కలిశామనేది సినిమా, పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రమిది. ప్రేమ, అత్యాచార సన్నివేశాలు ఉండవు.’
శివనాగు డైరెక్షన్ గురించి చెప్పండి?
- మంచి కథతో దర్శకుడు శివనాగు చాలా కష్టపడి తీశాడు. ఎంతో మంది ప్రముఖ హీరోలతో ఎన్నోమంచి సినిమాలు చేసిన అనుభవం అతనికి ఉంది. సీనియర్ నటుల పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి. అతనికి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు, కథ కథనం చక్కగా నడిపించాడు. మన ఊళ్లలో ఉండే అందాలు చూపించాడు. మిర్యాలగూడలో జరిగిన అమృత ప్రణయ్ ల కథను యధార్థంగా కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు శివనాగు. ఆ కథలో అమృత ప్రణయ్ లుగా అర్చన, బాలాదిత్య నటించారు. మారుతీ రావు పాత్రను బెనర్జీ పోషించారు. జమున, సుధ, రఘుబాబు, జీవ, వర్ష వంటి పేరున్న నటీనటులతో తీసిన చిత్రమిది. మనవడిగా నటించిన మాస్టర్ రవితేజ కూడా బాగా చేశాడు.
నిర్మాత పట్ల మీ అభిప్రాయం?
- నిర్మాత ఎంఎన్ఆర్ చౌదరి గారు ఎక్కడా రాజీ పడకుండా భారీగానే నిర్మించారు. అలాగే మంచి అభిరుచి గల నిర్మాత. ఆయనకు నాలుగు రూపాయలు వస్తే సంతోషిస్తా.. భయభక్తులతో ఇండస్ట్రీలో అందరినీ గౌరవిస్తూ ఉన్నాను కాబట్టే ఇన్నాళ్లు ఉండగలిగాను అన్నారు.