గత ఎన్నికల టైంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని.. సినిమా వాళ్ళని బహిరంగంగా కడిగిపారేసి.. రాజకీయాల్లో చక్రం తిప్పుదామని రాజకీయనాయకుల చేతిలో బలైపోయిన 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ ఇప్పడు రాజకీయాలను తిడుతూ సినిమా వాళ్ళని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నాడు. తిరుపతిలో ఎస్వీబిసి చైర్మన్‌గా కన్ను మిన్ను కానకుండా సినిమా వాళ్లని బూతులు తిట్టడం, జగన్ సీఎం అవడం ఇష్టం లేకనే సినిమా పెద్దలెవరూ జగన్‌ని కలవలేదంటూ.. సినిమా ప్రముఖులను ఏదో చేద్దామని.. తనదైన తరహాలో రెచ్చిపోయిన పృథ్వీ.. ఇప్పుడు రాజకీయాలతో జీరో అయ్యాక సినిమా వాళ్ళ విలువ తెలిసొచ్చి.. చివరికి సినిమాలే గతి అన్నట్టుగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు.
ఎస్వీబిసి చైర్మన్ గా తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న పృథ్వీ ఆ పదవికి రాజీనామా చేసాక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇప్పటికీ రాజకీయాల వల్ల తాను బలైపోయా అని.. సొంత పార్టీ నాయకులే తనని బలి చేసారని.. సుబ్బారెడ్డి కోరడంతోనే తాను రాజీనామా లేఖను సమర్పించినట్టు.. జగన్ తనని రాజీనామా చెయ్యమని చెప్పలేదని.. అని వాపోతున్నాడు. తనని ఈ ఎపిసోడ్‌లో చెప్పుతో కొట్టినట్టుగా బయటకి పంపేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు.
అయితే సినిమా పెద్దలైన చిరుని పొగిడే కార్యక్రమం పెట్టాడు. చిరు వలన తాను ఇప్పటికి బ్రతికున్నా అని.. చిరు వలనే తన కుటుంబం ఇంకా బ్రతికుందని... నాకు వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చిరంజీవి చెప్పారని చెబుతున్నాడు. మరి ఇప్పటి వరకు రాజకీయాలను చూసి మిడిసిపడిన పృథ్వీ ఇప్పుడు సినిమా అవకాశాలు కోసం అందరి కాళ్లు పట్టుకునే స్థితితో కనబడుతున్నాడు.