అభినయానికి ఆస్కారమున్న పాత్రలను కోరుతున్న లావణ్యా త్రిపాఠి
ఆకర్షణీయమైన, మనోహరమైన రూపానికి అద్భుతమైన అభినయం తోడైతే లావణ్యా త్రిపాఠి. తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన అందాల రాక్షసి ఆమె. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అభినయానికి మంచి మంచి పాత్రలు, చిత్రాల్లో నటిస్తున్నారు. అసంబద్ధమైన చిత్రాల్లో నటించడం కంటే నిశ్శబ్దంగా ఇంట్లో ఉండటానికి ఇష్టపడే లావణ్యా త్రిపాఠికి ఇప్పుడు తెలుగు, తమిళ భాషలలో ఆసక్తికరమైన పాత్రలు వస్తున్నాయి. ఆమెకు స్క్రిప్ట్ నచ్చితే ఆ సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. వంద శాతం బెస్ట్ అవుట్ పుట్ ఇస్తారు. ఒక్కసారి కమిట్ అయితే ఎంత కష్టమైనా పడతారు. ఇటీవల దక్షిణాది సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేక, కొన్ని బాలీవుడ్ సినిమాలను ఆమె వదులుకున్నారు.
తెలుగులో ‘అర్జున్ సురవరం’ విజయం తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ లో లావణ్యా త్రిపాఠి నటిస్తున్నారు. అందులో సందీప్ కిషన్ సరసన ఆమె కనిపించనున్నారు. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో ఆమెది హాకీ క్రీడాకారిణి పాత్ర. సినిమా కోసం కొన్ని రోజులు హాకీలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ విజయాల తర్వాత ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ లో ఆమెకు హ్యాట్రిక్ సినిమా అది.
తమిళంలో అథర్వ కథానాయకుడిగా కొరటాల శివ శిష్యుడు రవీంద్ర మాధవ దర్శకత్వంలో మైఖేల్ రాయప్పన్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. అందులో లావణ్యా త్రిపాఠి కథానాయిక. అందంతో పాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలిసింది. లావణ్యా త్రిపాఠి అయితేనే పాత్రకు న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతలు భావించి, ఆమెను తీసుకున్నారు. లావణ్యా త్రిపాఠి ప్రజెన్స్ సినిమాకు వేల్యూ యాడ్ చేస్తుందని దర్శకుడు భావిస్తున్నారు.