పెళ్ళి చూపులు సినిమాతో తెలుగు తెరకి న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీని పరిచయం చేసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ఆ సినిమాతో మంచి విజయం అందుకోవడమే కాదు తను రాసిన మాటలకి జాతీయ అవార్డు గెలుచుకున్నాడు. అయితే పెళ్ళి చూపులు తర్వాత తాను దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది మూవీకి అంతగా అప్లాజ్ రాలేదు. నగరానికి ఏమైంది వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న తరుణ్ నుండి మరో సినిమా రాలేదు.
ఈ రెండు సంవత్సరాల గ్యాప్ లో తరుణ్ యాక్టర్ గా మారి ఫలక్ నుమా దాస్ లో ఓ చిన్న క్యారెక్టర్ చేసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఫలక్ నుమా దాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో హీరోగా మారి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా తీశాడు. విజయ్ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. నటన పరంగా తరుణ్ బాగానే చేసినప్పటికీ బాక్సాఫీసు వద్ద సినిమా ఫ్లాప్ అయింది.
దాంతో నటనకి కూడా గ్యాప్ వచ్చేసింది. మొన్నటి వరకు తరుణ్ వెంకటేష్ తో హార్స్ రేసింగ్ నేపథ్యంలో సినిమా తీస్తున్నాడని, ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత సమాచారం ప్రకారం తరుణ్ ఈటీవీ ప్లస్ లో స్టార్ట్ కాబోతున్న నీకు మాత్రమే చెప్తా ప్రోగ్రామ్ కి యాంకర్ గా మారబోతున్నాడట. ఈ ప్రోగ్రామ్ హిందీలో వచ్చే కాఫీ విత్ కరణ్ మాదిరిగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. డైరెక్టర్ నుండి హీరోగా మారి, హీరో నుండి యాంకర్ గా మారబోతున్న తరుణ్ కి ఇక్కడైనా సక్సెస్ సాధిస్తాడా లేదా చూడాలి.