పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం తన 26వ సినిమా ‘వకీల్ సాబ్’ చేస్తున్న విషయం తెలిసిందే. అది మే 15న విడుదల కానుంది. దీంతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో 27వ సినిమా కూడా ఆయన చేస్తున్నాడు. పీరియడ్ ఫిల్మ్‌లా రూపొందుతోన్న ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతుండగానే, నిర్మాత ఎ.ఎం. రత్నం ‘వారాహి’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడం ఆసక్తి కలిగిస్తోంది. ఆ టైటిల్ పవన్ కల్యాణ్ సినిమా కోసమే అనే విషయం తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఏదేమైనా ఈ రెండు పేర్లలో ఒకటి కచ్చితంగా పవన్ కల్యాణ్-క్రిష్ మూవీ టైటిల్ అవుతుందని నమ్మవచ్చు. క్రిష్‌తో చేస్తున్న సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు ఇప్పటికే పవర్ స్టార్ అంగీకరించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలు కానున్నది.
కాగా ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ కాంబినేషన్ మరోసారి వర్కవుట్ అవనున్నట్లు సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో చేసిన ‘టెంపర్’ తర్వాత ఇంతవరకూ మరో టాప్ స్టార్‌తో కలిసి పనిచేసే చాన్స్ రాని పూరి జగన్నాథ్, ఇటీవల పవన్ కల్యాణ్‌ను కలిసి ఒక లైన్ చెప్పారనీ, అది ఆయనకు నచ్చిందనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. మధ్యలో కాస్త గాడి తప్పినట్లు అనిపించిన పూరి కెరీర్ ‘ఇస్మార్ట్ శంకర్’ తో దారిలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు. దాని తర్వాత ఎలాగైనా ఒక టాప్ స్టార్‌తో సినిమా చెయ్యాలనీ, అదీ పవన్ కల్యాణ్ అయితే, ఆ కిక్కే వేరుగా ఉంటుందనీ ఆయన భావిస్తున్నాడు.
అయితే పూరి అనుకున్నట్లు జరుగుతుందా, లేదా అనే విషయం కచ్చితంగా చెప్పలేని స్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే త్రివిక్రమ్, గౌతమ్ తిన్ననూరి కూడా లైన్‌లో ఉన్నారు. ఆల్రెడీ గౌతమ్ కథ కూడా చెప్పాడు. అతనితో సినిమా చేస్తానని కల్యాణ్ హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కల్యాణ్‌తో రెండో సినిమా చెయ్యాలనే పూరి ఆశలు ఫలిస్తాయా, లేదా?.. అనేది కాలమే చెప్పాలి.