ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల జోరు బాగా నడుస్తుంది. దక్షిణాదిన ప్రతీ ఒక్కరికీ పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఉంది. మన సినిమాలకి మార్కెట్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ ఆ మార్కెట్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అదీగాక మన హీరోల్లో చాలా మందికి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. అందుకే ప్రతీ హీరో తన సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని భావిస్తున్నాడు.
అందుకే తాము చేసే సినిమాల్లో పరభాషా నటులు ఉండేలా చూసుకుంటున్నారు. ఇతర భాషల నుండి నటులని తెచ్చి ఆ భాషా ప్రేక్షకులని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మన దేశ నటులని ఎక్కడి నుండి తీసుకువచ్చినా దానికో అర్థం ఉంటుంది. కానీ హాలీవుడ్ నుండి దిగుమతి చేసుకోవాలని చూస్తేనే కొంచెం అతిగా అనిపిస్తుంది. అసలు వారు అవసరం ఉందా అన్న విషయం కూడా చూసుకోకుండా కేవలం పాపులారిటీ వస్తుంది కదా అన్న ఉద్దేశ్యంతో వారిని పెట్టుకోవడం వల్ల లాభం ఏముంటుంది అనేది సందేహంగా ఉంది.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా తెరకెక్కబోతుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అందుకోసం ప్రఖ్యాత బాక్సర్ అయిన మైక్ టైసన్ ని తీసుకురావాలని భావిస్తున్నారట. అయితే అంత పెద్ద పెద్ద స్టార్స్ ని తీసుకురావడం పబ్లిసిటీ పరంగా లాభం ఉంటుందేమో కానీ సినిమా విజయంలో దాని ప్రభావం ఎక్కువ ఉండదని అంటున్నారు. మరి కథాపరంగా ఏం చెయ్యాలో దర్శకులకే తెలుసు కాబట్టి ఎవరిని తీసుకోవాలో లేదో వారికే వదిలేయడం మంచిదని కొందరు అంటున్నారు.