ప్రతీ శుక్రవారం థియేటర్ల వద్ద ఉండే సందడి అందరికీ తెలిసిందే. కొత్త సినిమాలతో ప్రతీ థియేటర్ వద్ద జనాల సందడి ఎక్కువగా ఉంటుంది. ఒకటికి మించి సినిమాలు విడుదల అవుతూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతుంటాయి. విడుదల అన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేవు. మూడు సినిమాల్లో ఏదో ఒకటి మాత్రమే ప్రేక్షకుల అటెన్షన్ పొందుతూ ఉంటుంది. అయితే జనవరి నుండి ఇప్పటి వరకు ప్రతీ శుక్రవారం ఏదో ఒక మంచి చిత్రం ప్రేక్షకుల మనసు గెలుచుకుంటూనే ఉంది.
ప్రతీవారం లాగే నేడు కూడా బాక్సాఫీసు వద్ద మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ చిత్రాల ఫలితం ఎలా ఉందనేది పక్కన పెడితే ఈ రోజు రిలీజ్ అయిన సినిమాల గురించి జనాలకి తెలిసింది చాలా తక్కువ. మూడు చిన్న చిత్రాలే కావడం, ఇంటర్మీడియెట్ విద్యార్థులకి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జనాలు సినిమా గురించి పట్టించుకున్నది చాలా తక్కువ. థియేటర్లలో మూడు సినిమాలు వచ్చినా జనాలు పట్టించుకోని ఈ పరిస్థితిలో డిజిటల్ మీడియాలో విడుదలలు ఎక్కువయ్యాయి.
ఈ రోజు యూట్యూబ్ లో మొత్తం ఐదు సినిమాలకి సంబంధించిన అప్డేట్లు వదిలారు. మొదటగా అనుష్క నటిస్తున్న నిశ్శబ్దం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా నుండి పాటని విడుదల చేయబోతున్నట్లు ప్రోమోని వదిలారు. ఇంకా రామ్ పోతినేని హీరోగా నటిస్తున రెడ్ మూవీ నుండి, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా నుండి చెరో మెలోడీని వదిలారు. ఇక చివరగా శర్వానంద్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం శ్రీకారం గ్లింప్ వీడియోని రిలీజ్ చేశారు. మొత్తానికి ఈరోజు బాక్సాఫీసు వద్ద కంటే డిజిటల్ దగ్గరే సందడి ఎక్కువగా ఉంది.