శర్వానంద్ గత కొన్ని రోజులుగా బ్యాడ్ టైమ్ ని ఎదుర్కొంటున్నాడు. శతమానం భవతి సినిమా తర్వాత మళ్ళీ శర్వాకి సరైన హిట్ రాలేదు. పడి పడి లేచే మనసు, రణరంగంతో సహా మొన్న లేటెట్ గా వచ్చిన జాను సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. దీంతో శర్వా మార్కెట్ చాలావరకు దెబ్బ తింది. ఇలాంటి టైమ్ లో శర్వా నుండి మరో కొత్త చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. కిషోర్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ఈ చిత్రానికి శ్రీకారం అనే పేరు పెట్టారు.
14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ రైతుగా కనిపించనున్నాడు. అయితే నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకారం నుండి గ్లింప్ల్ వీడియోని రివీల్ చేసారు. ఈ వీడియోలో యువరైతుగా శర్వానంద్ లుక్ అదిరిపోయింది. రైలు పట్టాల పక్కన ఉన్న పొలంలో శర్వానంద్ ట్రాక్టర్ తో పొలం దున్నుతూ పక్కా పల్లెటూరి వాడిలా కనిపిస్తున్నాడు.
షార్ట్ ఫిలిమ్ ఆధారంగా శ్రీకారం తెరకెక్కుతుందట. షార్ట్ ఫిలిమ్ తీసిన దర్శకుడే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడట. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక ఆరుళ్ మోహన్ శర్వా సరసన జోడీగా నటిస్తుంది. మరి వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న శర్వాకి శ్రీకారంతోనైనా హిట్ దక్కుతుందా లేదా చూడాలి. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.