ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ రూపొందనున్న సినిమా పాన్ ఇండియా సినిమా కాదు మరి కేవలం టాలీవుడ్ మూవీగానే తీస్తారా? కానే కాదు. ఆ మూవీని ఇంటర్నేషనల్ మూవీగా తీర్చిదిద్దే పనిలో నాగ్ అశ్విన్ ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని అతను రూపొందించనున్నాడు. కాబట్టి దానికి ఇంటర్నేషనల్ స్పాన్ ఉంటుందని, అందుకే ఇంటర్నేషనల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని దాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తయింది కూడా. హీరో క్యారెక్టరైజేషన్ సినిమాకి ప్రధాన బలం అవుతుందని సమాచారం. ఇవాళ ఇండియాలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఒక్కడే. అతను తప్ప తన హీరో క్యారెక్టర్‌కు మరెవరూ న్యాయం చెయ్యలేరని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడు.
ఇటీవల ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయమే అతను చెప్పాడు. ‘‘దేశంలో ఆ క్యారెక్టర్‌ను చెయ్యగల హీరో ప్రభాస్ ఒక్కడే. మరెవ్వరూ దానికి న్యాయం చెయ్యలేరు. అందుకే నా సినిమాకు హీరోగా ప్రభాస్‌ను ఎంచుకున్నాను’’ అని చెప్పాడు నాగ్ అశ్విన్. ఈ మూవీలో ప్రభాస్ సూపర్ హీరో క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. రూ. 200 కోట్ల పైగా బడ్జెట్‌తో తయారయ్యే ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై చలసాని అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్‌కు రూ. 70 కోట్ల రెమ్యూనరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కూడా ఇచ్చేందుకు అశ్వినీదత్ అంగీకరించినట్లు వినిపిస్తోంది.
కాగా ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమా బాక్సాఫీస్ ఫలితంపై కూడా ఈ సినిమా బడ్జెట్ ఆధారపడి ఉంటుందని సమాచారం. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో ప్రభాస్ చేస్తున్న సినిమాకు ‘ఓ డియర్’, ‘రాధే శ్యామ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. వీటిలో ‘ఓ డియర్’ ఖాయం కావచ్చనేది అంతర్గత వర్గాల భోగట్టా. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ఒక లవ్ స్టోరీ. ఈ సినిమా హిట్టయితే ప్రభాస్ మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. ఫెయిలైతే తర్వాతి సినిమా బిజినెస్‌పై ప్రభావం చూపిస్తుంది. ‘బాహుబలి’ సినిమాల వల్లే ప్రభాస్ మునుపటి సినిమా ‘సాహో’ ప్రి బిజినెస్ అనూహ్య రీతిలో జరిగింది. ఒక్క హిందీ బెల్ట్‌లో మాత్రమే లాభాలు సాధించిన ఆ సినిమా తెలుగునాట నష్టాలు పొందడం మనం చూశాం. ‘ఓ డియర్’ విషయంలోనూ అదే రిజల్ట్ రిపీటైతే నాగ్ అశ్విన్ సినిమా బడ్జెట్‌పై కోత పడక తప్పదు.