కమల్ హాసన్‌తో భారతీయుడు సీక్వెల్‌ని శంకర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి... ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. కమల్ హాసన్‌తో భారతీయుడు 2ని తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నట్టుగా అధికారిక ప్రకటనతో హంగామా చెయ్యడం.. దర్శకుడు శంకర్ బడ్జెట్‌కి భయపడి దిల్ రాజు భారతీయుడు సీక్వెల్ నుండి తప్పుకోవడంతో.. దిల్ రాజు ప్లేస్‌లోకి లైకా ప్రొడక్షన్స్ వచ్చి చేరింది. ఇక భారతీయుడు 2 అనుకున్నదానికన్నా ఆలస్యం అయినా ఎలాగో పట్టాలెక్కింది. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చిత్రీకరణ అయ్యాక మళ్లీ బడ్జెట్ పరిమితి దాటిపోతుంది అన్నాక కొన్నిరోజులు షూటింగ్ కి బ్రేక్ వేశారు.
తర్వాత ఎలాగోలా మళ్లీ సక్రమంగా షూటింగ్ మొదలవడం... అనుకోకుండా భారతీయుడు 2 షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరగడం అందులో ముగ్గురు మరణించడం పెద్ద సంచలనం అయ్యింది. తర్వాత నిర్మాతలతో పాటుగా దర్శకుడు శంకర్, కమల్ హాసన్‌లు మృతులకు, గాయాలపాలైన వారికీ భారీగా విరాళం ప్రకటించడం, రోజుకొకరు చొప్పున అంటే లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు, శంకర్, కమల్ హాసన్ లు పోలీస్‌ల ఎదుట హాజరవుతుండటం వంటిది వింటూనే ఉన్నాం.
ఇక కమల్ హాసన్‌కి లైకా ప్రొడక్షన్‌కి మధ్య సోల్డ్ వార్ జరగడం లేఖాస్త్రాలు సంధించడం చూసాం. కమల్ బహిరంగ లేఖ.. దానికి లైకా రిప్లయ్ ఇవ్వడం అన్నీ మీడియా ముఖంగానే జరిగాయి. తాజాగా కమల్ హాసన్ లైకా వారి మీద కోపంతో భారతీయుడు షూటింగ్‌కి హాజరవడం లేదని అంటున్నారు. ఆ బహిరంగ లేఖల వలన కమల్ కి లైకా వారికీ మధ్య దూరం పెరిగి.. కోల్డ్ వార్ మొదలయ్యింది అని ఇక కమల్ హాసన్ ఇండియన్ 2 నుండి తప్పుకున్నా తప్పుకోవచ్చనే ప్రచారం కోలీవుడ్ మీడియాలో మొదలయ్యింది.